
ఐఎస్‌సదన్‌లో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఎంపీ అరవింద్
సైదాబాద్: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావటం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా పేరిట ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతమధుకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే అరెస్ట్ అయ్యారని, అందులో ప్రమేయం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు.
కల్వకుంట్ల కుటంబంతో స్నేహం చేసిన మంచోళ్లు కూడా భ్రష్టుపట్టి జైళ్ల పాలవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల సొమ్ము కూడా బయటకు వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్‌రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.