ఢిల్లీ: బీజేపీలో చేరే ఇతర పార్టీల నేతల నాణ్యతను చెక్ చేసేందుకు బీజేపీ నూతన కమిటీని నియమించింది. పార్టీలో చేరాలనుకునే నేతలను అనుమతించాలా? తిరస్కరించాలా? అనేదానిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కమిటీయే నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ జనవరి 6న తొలిసారి సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీకి విధేయులుగా లేని నాయకులు చేరే ప్రమాదాన్ని తగ్గించేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముకుల్ రాయ్, బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చింది.
దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలో రావడానికి సన్నద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా లోటుపాట్లను సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా గెలుపొందడానికి ఎన్నికల ప్రచారాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ ఉన్నారు.
ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
Comments
Please login to add a commentAdd a comment