సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అంతర్మథనం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలేమిటి? గట్టిగా పోరాడినా కూడా అనుకున్న విధంగా ఫలితాలను ఎందుకు సాధించలేకపోయామనే కోణంలో పార్టీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 111 సీట్లలో 8 స్థానాల్లో మాత్రమే గెలుపునకు పరిమితం కావడంపై రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో అంతర్గత సమీక్షలకు రంగం సిద్ధమైంది.
పార్టీకి పట్టుతో పాటు, ముగ్గురు ఎంపీలు గెలిచిన ఉమ్మడి జిల్లాల పరిధిలో, ముఖ్యనేతలు (ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్) ఓటమి పాలవడం, దుబ్బాకలో మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓటమికి కారణాలు ఏమిటంటూ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, 2023లో 8 సీట్లలో గెలుపు, ఓటింగ్ శాతం 14కి పెంచుకోవడం ద్వారా మరీ తీసికట్టుగా కాకుండా గౌరవప్రదమైన ఫలితాలనే సాధించినా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోలేక పోయేందుకు ప్రభావం చూపిన అంశాలేమిటా అన్న లోతైన చర్చ సాగుతోంది.
గతం కంటే మెరుగే కానీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాం..
ఈ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీచేసి 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకోవడం (2018లో 118 సీట్లలో పోటీచేస్తే 104 చోట్ల డిపాజిట్లు గల్లంతు), పలు సీట్లలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడంతో పాటు గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం వంటివి పార్టీకి కలిసొచ్చే అంశాలేనని అంచనా వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ సర్కార్‌పై, అధికార బీఆర్‌ఎస్‌పై హోరాహోరీగా పోరాడినా.. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమించినా.. ఆ మేరకు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభ ఎన్నికలపై దృష్టితో బీజేపీ సాగించిన కృషితో అధికార బీఆర్‌ఎస్‌కు బీజేపీనే తగిన ప్రత్యామ్నాయం అన్న స్థాయికి వెళ్లి అక్కడి నుంచి పరిస్థితి దిగజారడానికి దారితీసిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనన్న దుష్ప్రచార ప్రభావమే
బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ క్రమం తప్పకుండా సాగించిన దుష్ప్రచారం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు రాష్ట్రనేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోవడం, ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కొందరు నేతలు అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం వంటివి నష్టాన్ని కలగజేశాయని అంచనా వేస్తున్నారు. లోపాయికారిగా మిలాఖత్ కారణంగానే బీఆర్‌ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వం, వివిధ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోలేదనే పద్ధతుల్లో కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
దీంతో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదంటూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపేలా చేసిందనే చర్చ కూడా పార్టీలో వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో క్షేత్రస్థాయి సమీక్షలు ముగించుకుని వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని భావిస్తోంది. నిర్ణీత గడువు ప్రకారమైతే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం ద్వారా మళ్లీ బీజేపీ సత్తాను చాటాలనే భావన పార్టీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది.
లెక్క ఎక్కడ తప్పింది?
Published Tue, Dec 5 2023 5:43 AM | Last Updated on Tue, Dec 5 2023 8:39 AM
Comments
Please login to add a commentAdd a comment