నిజామాబాద్‌లో జరిగిన అభినందన సభలో బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్
కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం
వచ్చే ఎన్నికల్లో 90–100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు అందరికీ న్యాయం చేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయి పదవుల వరకు చేరుకోవాలంటే కాంగ్రెస్ పారీ్టతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. తనకు పీసీసీ పీఠం దక్కడమే ఇందుకు నిదర్శనమని.. ఈ గౌరవం కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో మహేశ్‌కుమార్ గౌడ్ సన్మాన సభ జరిగింది. ఈ సభకు సగానికిపైగా మంత్రివర్గం తరలివచ్చి0ది.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తండ్రి మరణంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విదేశాల్లో ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు రాలేకపోయారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ మాట్లాడుతూ 38 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక కష్టనష్టాలు చవిచూశానని.. కానీ కష్టపడినందుకు పార్టీ నాయకత్వం గుర్తించి కలలో కూడా ఊహించని రీతిలో వడ్డీతో సహా పీసీసీ పీఠం అప్పగించిందన్నారు.
డీఎస్ ఆశీర్వాదం తీసుకొనేవాడిని..
దివంగత మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో తనకు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ గురువుగానే భావిస్తానని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరాటే మాస్టర్‌గా ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన డీఎస్.. 1986లో తనను ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా చేశారని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ డీఎస్ బతికి ఉంటే పీసీసీ చీఫ్ హోదాలో వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొనేవాడినని చెప్పారు.
సోషల్ ఇంజనీరింగ్‌తో ముందుకు..
రాహుల్ గాంధీ ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నా రు. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్, బీసీ గణన జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు.
2028 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలో 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు.
పీసీసీ కమిటీలో, డీసీసీల్లో 60 శాతం బీసీలకే పదవులు..
పీసీసీ కమిటీతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల్లోనూ 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికే కేటాయించనున్నట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కొదవ లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలాంటి రాజకీయ అండ లేనప్పటికీ పార్టీ అత్యున్నత గుర్తింపు ఇచ్చి0దని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు.
కార్యకర్తలే కాంగ్రెస్ బలం: దీపాదాస్ మున్షీ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలమన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ బలహీనంగా ఉందని గతంలో విన్నానని.. కానీ అభినందన సభకు ఇంత భారీగా కార్యకర్తలు, అభిమానులు రావడం చూస్తుంటే పార్టీ బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment