ఉచిత ఇసుకపై మాటల గారడినే
నిత్యావసరాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి
మద్యం ధరపైనా మాయమాటలే
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
ఎంవీపీకాలనీ(విశాఖ): రాష్ట్ర ప్రజలకిచ్చిన మోసపూరిత హామీలు ఎప్పుడు అమలు చేస్తారని వైఎస్సార్‌సీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబుని నిలదీశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల కోసం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ, తల్లికి వందనం రూ.15 వేలు, 50 ఏళ్లకే పింఛన్, యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు నెలకు రూ.1500 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.
హామీల అమలుపై ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ఇసుకే దొరకని దుస్థితి తెచ్చారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 10 టన్నుల ఇసుక విశాఖలో రూ.13 వేలుకు లభిస్తే.. ఇప్పుడు రూ.19 వేలు పైనే చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇసుకపై చంద్రబాబు ప్రకటనలన్నీ మాటల గారడినే అని అన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తానన్న చంద్రబాబు.. ఎమ్మార్పీకంటే ఎక్కువకు అమ్ముతున్నారని తెలిపారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారని గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఇప్పుడు ఆవే బ్రాండ్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పారు.
మద్యం ద్వారా కూటమి నాయకులకు సంపద సృష్టించడం మినహా చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అగ్గిపెట్టెలకు రూ.కోట్లు ఖర్చు చేసినట్లు చూపించిన ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. చంద్రబాబు దోపిడీ విధానాలకు ఇది పరాకాష్ట అని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే చంద్రబాబు ప్రభుత్వం కనీస నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు 5 ఏళ్లు నిర్విరామంగా రైతు భరోసా అందజేసి అండగా నిలిస్తే బాబు సర్కారు కనీస సాయం చేయడంలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment