సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్‌ఐఆర్. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు.
మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారు. రేవంత్ ఇంట్రెస్ట్ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది.
చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment