సిటీ కోర్టులు (హైదరాబాద్): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు, తమ పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, వాటిని విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు.
తనపై సురేఖ చేసిన కామెంట్లను చూసి పలువురు సాక్షులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి గత వారం విచారణలోనే కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉండగా..ఆయన కోర్టుకు రాలేకపోవడంతో న్యాయవాదులు వాయిదా కోరారు. జడ్జి ఎస్.శ్రీదేవి విచారణను బుధవారానికి వాయిదా వేయగా కేటీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు సాక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, తుల ఉమా, బాల్క సుమన్ కూడా తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు.
అయితే సమయం లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ వాంగ్మూలం మాత్రమే కోర్టు రికార్డు చేసింది. మిగతావారి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం నాటి విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు సురేందర్, అరవింద్, సిద్ధార్థ, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హాజరయ్యారు. తదుపరి విచారణకు సాక్షులు అందరూ హాజరుకావాలని ఆరోజు వారి వాంగ్మూలం తీసుకుంటామని జడ్జి శ్రీదేవి తెలిపారు.
కేటీఆర్ వాంగ్మూలం ఇలా..
‘డబుల్ పీజీ చేసిన నేను తొలుత అమెరికాలో ఉద్యోగం చేశా. 2006లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా టీఆర్‌ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. వివిధ దేశాల నుంచి కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశా.
కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అలాంటి నాపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవచేస్తున్న నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో, నా గురించి తెలిసిన చాలామంది బాధపడ్డారు. సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా, తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నేను డ్రగ్ అడిక్ట్‌నని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తానని, సినీ, రాజకీయ నేతలు చాలామంది విడాకులకు నేనే కారణమని.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు.
నేను అన్నీ చెప్పలేకపోతున్నా. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించా. నాపై అసత్య ఆరోపణలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని కేటీఆర్ కోర్టును కోరారు.
సురేఖ అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డా..
‘కేటీఆర్ నాకు 2007 నుంచి తెలుసు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశా. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపడ్డా. మా నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని శ్రవణ్‌కుమార్ తన వాంగ్మూలంలో కోరారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు బుధవారం కోర్టుకు వచ్చారు.
ఎలాంటి ఆధారాలూ లేకుండా దిగజారి మాట్లాడారు: కేటీఆర్
Published Thu, Oct 24 2024 6:14 AM | Last Updated on Thu, Oct 24 2024 12:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment