సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యకలాపాలను వేగవంతం చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నెలాఖరులోగా సోలాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహించేందుకు సభాస్థలిని ఎంపిక చేయాల్సిందిగా స్థానిక బీఆర్‌ఎస్ నేతలను ఆదేశించారు.
సభ నిర్వహణ ఏర్పాట్లపై మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ తాజాగా చర్చించినట్లు తెలిసింది. పార్టీ బలప్రదర్శనకు అద్దం పట్టేలా కనీసం 2 లక్షల మందిని ఈ సభకు సమీకరించాలని లక్ష్యం నిర్దేశించారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పార్టీ నేత ఎస్.వేణుగోపాలాచారి తదితరులకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
ఈ నెల 20 తర్వాత మంత్రి హరీశ్‌రావు సోలాపూర్‌లో సభాస్థలిని పరిశీలించి స్థానిక బీఆర్‌ఎస్ నేతలతో సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. సుమారు వారంపాటు పార్టీ నేతలతో కలసి సోలాపూర్‌లోనే మకాం వేసి సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలను పర్యవేక్షిస్తారు.
బీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు?
సోలాపూర్‌లో జరిగే బహిరంగ సభా వేదికగా ఎన్సీపీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఓ మాజీ ఎంపీ, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివసేన, ఎన్సీపీలో చీలిక, కాంగ్రెస్‌లో నిస్తేజం వంటి పరిణామాలు వివిధ పార్టీల నేతలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపేందుకు దోహదం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే బీఆర్‌ఎస్‌లో చేరే ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, వారి చేరికలకు సంబంధించి కేసీఆర్ వివరాలు వెల్లడిస్తారని మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. 2024లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిన వివిధ పార్టీల నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరగా వారిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన సోలాపూర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు నగేశ్ వల్యాల్, జుగన్‌భాయ్ అంబేవాలే, సంతోష్ బోంస్లే 30న జరిగే బహిరంగ సభలో కీలకపాత్ర పోషించనున్నారు.
సోలాపూర్‌పై పట్టు సాధించేందుకు
మహారాష్ట్రలోని మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్... నాందెడ్, ఔరంగాబాద్, నాగపూర్‌లలో సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే గత నెలలో సోలాపూర్‌లో రెండ్రోజులు పర్యటించారు. 30న నిర్వహించే భారీ సభ ద్వారా సోలాపూర్‌తోపాటు కొల్లాపూర్, సాంగ్లి, ఉస్మానాబాద్, బీడ్ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment