
బెంగళూరు: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి తన కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. శుక్రవారం ఆయన శికారిపురలో కుమారుడు విజయేంద్రతో కలిసి హుచ్చరాయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని అంజనాపుర జలాశయాన్ని సందర్శించి వాయనం సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శికారిపుర ప్రజలు తనను అనేక పర్యాయాలు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆశీర్వదించి లక్షకుపైగా మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అధికారం కలే
మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవి కోసం కలలు కంటున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, వారిద్దరూ సీఎంలు కాలేరని యడియూరప్ప అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ విజయాన్ని కాంగ్రెస్, ఇతర ఏ పార్టీ కూడా అడ్డుకోలేదన్నారు. విజయేంద్ర మాట్లాడుతూ యడియూరప్ప కేవలం ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయరని, రాజకీయాలకు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment