సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ఉన్మాదుల్లా వ్యవహరిస్తూ రాష్ట్రానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ఘాటుగా విమర్శించారు. ప్రతి రోజూ ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా అనాగరికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ఆరోపణలు దుర్మార్గం.. దారుణం అని నిప్పులు చెరిగారు.
సుదీర్ఘ కాలం మంత్రులుగా పనిచేసి, అనేక విదేశీ ప్రయాణాలు చేసిన వారు వయసు మీద పడుతున్నా కనీస సంస్కారం లేకుండా దిగజారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం బుగ్గన ఓ ప్రకటన, అమర్‌నాథ్ వీడియో ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన రహస్యమేమి కాదని, కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ వెళుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలను పట్టించుకోకుండా యనమల, ఎల్లో మీడియా సీఎం కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ‘శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది.
కానీ ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైంది. అందువల్ల లండన్‌కు ఆలస్యంగా చేరుకుంది. అక్కడా ఆలస్యం కావడంతో రాత్రి బస అక్కడే ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే జూరెక్‌కు బయలుదేరడానికి పైలెట్లు విశ్రాంతిలో ఉన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి మీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెరలేపింది’ అని బుగ్గన మండిపడ్డారు.
విషం చిమ్మడం కాక మరేంటి?: గుడివాడ అమర్‌నాథ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలపై విషం చిమ్ముతోంది. రాష్ట్రానికి మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం దావోస్ పర్యటనకు వెళితే ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతో టీడీపీ నేత యనమల, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగడం దారుణం. తొలి నుంచి తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.
సీఎం జగన్ చేపట్టిన ప్రతి పనిపైనా రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా చంద్రబాబు అండ్ గ్యాంగ్ విష ప్రచారం చేయడం రివాజుగా మారింది. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు, మంత్రులుగా పనిచేసి.. విదేశీ పర్యటనలు చేసిన వాళ్లకు ఈ నిబంధనలు అన్నీ తెలిసినప్పటికీ ఇలా దుష్ఫ్రచారానికి ఒడిగట్టడం చూస్తుంటే.. వారికి జగన్‌పై ఉన్న కడుపు మంట, అక్కసును తెలియజేస్తోంది. రాష్ట్రానికి మంచి జరగకూడదు.. జగన్‌కు మంచి పేరు రాకూడదన్నదే వీరి లక్ష్యం.
టీడీపీ విష ప్రచారం దుర్మార్గం
Published Sun, May 22 2022 4:19 AM | Last Updated on Sun, May 22 2022 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment