సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బడ్జెట్ తమదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై శాసన సభలో చర్చకు మంగళవారం మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయికంటే మెరుగైన రీతిలో వివిధ రంగాల్లో వృద్ధి రేటు సాధించడం తమ ప్రభుత్వ ఘన విజయమని ఆయన చెప్పారు. చీకటి బడ్జెట్ అన్న టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే తమ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పురోభివృద్ధి సాధించిందని గణాంకాలతో సహా వివరించారు. ‘కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నా, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా కొనసాగిస్తున్నాం.
2018–19లో రాష్ట్ర రాబడి రూ.58,037 కోట్లు ఉంది. కాంపౌండింగ్ గ్రోత్‌నుబట్టి 2019–20లో రూ.65,928 కోట్ల రాబడి రావాల్సి ఉండగా రూ. 57,831 కోట్లు మాత్రమే వచ్చింది. 2020–21లో రూ.74,893 కోట్ల రాబడి రావాల్సి ఉండగా రూ.57,427 కోట్లు, 2021–22లో రూ.85,077 కోట్లు రావాల్సి ఉండగా రూ.73,629 కోట్లు వచ్చింది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. రాష్ట్రంలో ఒక్క లేబొరేటరీ లేని స్థితి నుంచి వైద్య మౌలిక వసతులు పెంచుకుంటూ దేశంలోనే కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న టాప్–3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపడం సీఎం జగన్ ఘనత.
కేవలం 0.67 శాతం మరణాల రేటుతో దేశంలో కోవిడ్ మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 2021– 22లో రాష్ట్రం స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం, తలసరి ఆదాయంలో 17.58% వృద్థి రేటు సాధించింది. వ్యవసాయ రంగంలో 14.5%, పరిశ్రమల రంగంలో 25.58%, సేవా రంగంలో 18.91% పెరుగుదల మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం. నీతి ఆయోగ్ నివేదికలపరంగా దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఏపీ నిలిచింది. టీడీపీ ఆరోపిస్తున్నట్టు దోచుకుందీ దాచుకుందీ ఎక్కడ’ అని బుగ్గన ప్రశ్నించారు.
సంక్షేమ, అభివృద్ధికారక బడ్జెట్: స్పీకర్ తమ్మినేని
సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉన్న బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో మంగళవారం సమాధానం ఇచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ.. ‘పేదరికాన్ని రూపుమాపేందుకు విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించడం ప్రశంసనీయం. పేద పిల్లల విద్య కోసం ఇంతగా చొరవ చూపిన ప్రభుత్వం మరొకటి లేదు. అవినీతి రహిత పరిపాలనను అందిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్ జగన్ డైనమిక్ సీఎం. రాష్ట్రాభివృద్ధికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా సాగిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ ఆయన ప్రయత్నానికి సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని చెప్పారు.
బడుగు వర్గాల ఆర్థిక స్వావలంబన: ప్రభుత్వ విప్ చెవిరెడ్డి
బడుగు, బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబన దిశగా బడ్జెట్‌లో భరోసా ఇచ్చారు. దేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్న గాంధీజీ మాటలను అనుసరించి గ్రామ స్వరాజ్యం దిశగా అనేక సంక్షేమ పథకాలకు తీసుకొస్తున్నారు. రైతు త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వంగా బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉంది.
మహిళలు పండుగ చేసుకుంటున్నారు: ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్
యూరప్ దేశాల్లోని విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తూ అంగన్‌వాడీ స్కూళ్లను పీపీ1, పీపీ2 స్కూళ్లుగా మార్చడంపట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడితో మరెందరో విద్యార్థులు బాల్య వివాహాల నుంచి విముక్తి పొందారు. ప్రతి పల్లెలో మహిళలు పండుగలు చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం పల్లెల్లోకి తీసుకొచ్చారు.
వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే ధనలక్ష్మి
మా ప్రభుత్వంలో భూమి కనిపిస్తే రైతు ఏ పంట వేస్తే మంచిదో ఆలోచిస్తాం. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించాం. అదే టీడీపీ వాళ్లు దానిని ఎలా రియల్ ఎస్టేట్ చేయాలో లెక్కలేస్తారు. ఏళ్లుగా వెతలు పడుతున్న గిరిజన రైతులకు లక్షల ఎకరాల కొండు పోడు భూముల సాగు హక్కు పత్రాలను ఇచ్చిన చరిత్ర జగనన్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై రాళ్లు విసురుతున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అవే రాళ్ల దెబ్బలు తగులుతాయి.
చిత్తశుద్ధితో పాలన: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు, ఇబ్బందులు తీర్చాలనే చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ సీరియస్ సినిమాలో వచ్చే కమెడియన్ లాంటి వాడు.
ప్రగతిదాయక బడ్జెట్: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
రాష్ట్ర ప్రగతికి దోహదపడే బడ్జెట్ ఇది. అన్ని వర్గాల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించడం సంతోషకరం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా బడ్జెట్‌లో జాగ్రత్తలు తీసుకోవడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సానుభూతిపరులు అనర్హులైనా పథకాలు ఇచ్చారు. మిగిలిన ప్రజలకు అర్హతలు ఉన్నప్పటికీ జాబితా నుంచి తొలగించడమే పనిగా ఉండేది. ప్రస్తుతం మా ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా ప్రజలకు ఇవ్వడమే పనిగా పెట్టుకుంది.
టీడీపీ చేసిన అప్పులు ఏం చేశారో చెప్పగలరా?
‘మా ప్రభుత్వం చేసిన అప్పులు సంక్షేమ పథకాలుగా ప్రజలకు చేరాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఆధార్ కార్డులతో సహా పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాం. టీడీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. ఆ నిధులు ఆ పార్టీ వారి జేబుల్లోకే వెళ్లాయి. అంతగా అప్పులు చేసిన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది చేశామని ప్రజలకు చెప్పుకోడానికి ఒక్కటైన ఉందా? కాగ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా ఉన్న పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా చేజిక్కించుకుని టీడీపీ రాజకీయ రాద్ధాంతం చేస్తోంది’ అని మంత్రి బుగ్గన విమర్శించారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్‌పై దాడికి యత్నించినప్పటి నుంచి ఇప్పటివరకూ సభలో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో బాంబులు వేస్తున్న ప్రదేశాలను గూగుల్‌లో చూసి గుర్తించాలన్న తెలివి తేటలున్న చంద్రబాబు, టీడీపీ నేతలతో తామేం వాదించగలమని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment