
తెలంగాణ నుంచి ఒక రెడ్డి, ఒక బీసీకి బెర్త్‌లు దక్కే అవకాశం
రేసులో కిషన్‌రెడ్డి,డీకే, బండి, ఈటల, ధర్మపురి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఈసారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు పార్టీలో అంతర్గత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలిసింది. పార్టీలో సీనియారిటీ, విధేయత, కులాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఒక రెడ్డి, మరొక బీసీ సామా జికవర్గ నేతకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇదివరకే కేబినెట్ మంత్రిగా పనిచేసిన జి.కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ పోటీలో ఉండే అవకాశం ఉంది. అయితే కిషన్‌రెడ్డినే మరోమారు కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్షు డిగా కొనసాగించాలని నిర్ణయిస్తే అరుణకు అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మ పురి అరవింద్, ఈటల రాజేందర్‌లలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇందులో వరుసగా రెండోసారి గెలిచిన బండికే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోదీ పట్ల ఉన్న విధేయత, 2 లక్షలకుపైగా మెజారిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆయనకు సంఘ్ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందనే వాదన ఉంది. ఇక సీనియర్ నేతగా ఈటలకు సైతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా, తొలిసారి ఎంపీగా ఎన్నికవడం, పార్టీలో చేరి ఎక్కువకాలం కాకపోవడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
కేబినెట్‌లో తీసుకునే వారి పేర్లపై గురువారం లేక శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకుముందే మంత్రి పదవులపై స్పష్టత రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment