
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడు మాట్లాడి తాను చులకన కాదలచుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుపై విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తూ.. ఎవరెవరో మాట్లాడే వాటిపై తాను స్పందించనని అన్నారు.
అవసరమైతే ఢిల్లీతో పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం, ప్రజలు గట్టిగా ఉంటే కేంద్రం దిగి వస్తుందని, ఇందుకు జల్లికట్టు ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఇటీవల బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు గాశారు.
ఆయనతో కొద్దిసేపు మాట్లాడి వచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిద్ధమైందంటూ ఎల్లో, సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అయితే, బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను గందరగోళంలో పడేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
వలంటీర్లను ప్రజా సేవకే పరిమితం చేస్తాం
తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను ప్రజా సేవకు మాత్రమే పరిమితం చేసే విషయాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ వలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. వలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్ల సేవలను గౌరవిస్తామని, కానీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటే సహించేది లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీ విధ్వంసం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఉంటాయన్నారు.
అయినా తనకున్న బ్రాండ్, పాలసీలతో వేగంగా సంపద సృష్టిస్తానని తెలిపారు. తాను చెప్పిన పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కష్టమేనని, కానీ దానివల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.
ఈ నెల 14న పార్టీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమంపై ప్రచారం ప్రారంభిస్తామన్నారు. బస్సులు, కార్ల ద్వారా మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులు పర్యటనలు చేస్తారని తెలిపారు. మహిళలకు ఇంకా ఏం చేయవచ్చనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
రామోజీకి ఇచ్చే గౌరవం ఇదేనా?
రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడిందని, అది ఎప్పుడు తేలుతుందో తెలియదన్నారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా అని ప్రశ్నిoచారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ అసమర్థతతో నాశనం చేశారని విమర్శించారు. నదుల అనుసంధానం కోసం తాను ప్రతిపాదించిన ప్రణాళికను చేపట్టి ఉంటే నీటి కరువు ఉండేది కాదన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందని, ఏపీ మాత్రం పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందని అన్నారు.
రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారంపై పోరాటాన్ని తీవ్రం చేస్తామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదిలేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా సంస్థగా ఈనాడు ప్రశ్నిస్తోందనే మార్గదర్శిపై కేసులు పెట్టారని విమర్శించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వడానికి సీఐడీకి అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. మార్గదర్శిని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. పద్మవిభూషణ్ రామోజీరావును గౌరవించుకునే విధానం ఇదేనా అని చంద్రబాబు అన్నారు.