TS: బీజేపీలో15 మంది జిల్లా అధ్యక్షుల మార్పు? | Change of 15 district presidents in Telangana BJP | Sakshi
Sakshi News home page

TS: బీజేపీలో15 మంది జిల్లా అధ్యక్షుల మార్పు?

Published Sun, Dec 31 2023 4:49 AM | Last Updated on Sun, Dec 31 2023 7:02 AM

Change of 15 district presidents in Telangana BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పుచేర్పులపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టి పెట్టారు. దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించని జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించినందున, వీటిలో 15 నుంచి 20 జిల్లాలకు చురుగ్గా పనిచేసే కొత్త అధ్యక్షుల నియామకం దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.

పలువురు జిల్లా అధ్యక్షులు దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగుతున్నందున పని తీరు, అప్పగించిన విధులు, బాధ్యతల నిర్వహణ, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పాత్ర తదితర అంశాల ప్రాతిపదికన మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు చెబుతున్నారు. శనివారం పార్టీనాయకులతో కిషన్‌రెడ్డి సమావేశమైన సందర్భంగా సంస్థాగత మార్పులకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టినట్టు సమాచారం. 

ఇక కిషన్‌రెడ్డి టీం? 
వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో...పకడ్బందీగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు తన టీమ్‌ను నియమించుకునే దిశగా కిషన్‌రెడి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు పూరిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా 17 ఎంపీ స్థానాల పరిధిలో పార్లమెంట్‌ కమిటీలను నియమించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలసమయంలో పార్టీ కోసం సరిగ్గా పనిచేయని వారు, బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, దీర్ఘకాలికంగా జిల్లా అధ్యక్షులు, ఇతర బాధ్యతల్లో ఉన్న వారు, పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మార్చాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. 

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్‌లు... 
శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన పలువురికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. వీరిలో ఇద్దరు ముగ్గురు జిల్లా అధ్యక్షులతో పాటు పదిమంది వరకు రాష్ట్రస్థాయి నాయకులు ఉంటారని తెలుస్తోంది. ఈ నోటీసులపై వారం, పదిరోజుల్లో వివరణ అందాక ఆరోపణల తీవ్రతను బట్టి సస్పెన్షన్లు, ఇతర చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

శనివారం పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్‌ ఎం.ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్‌ రవీందర్‌ విశ్వనాథ్, సభ్యులు నాగూరావు నామాజీ, పద్మజా రెడ్డి, బోసుపల్లి ప్రతాప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకులపై వచి్చన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement