నియామక ప్రక్రియలో అనుసరిస్తున్న తీరుపై కొందరు నేతలు, కార్యకర్తల అసహనం
జిల్లాకు ఐదేసి పేర్లతో ఆశావహుల లిస్ట్ సమర్పించాలన్న హైకమాండ్
కొందరు పరిశీలకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురూ అయ్యింది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్య కర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లా ల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయసేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు ఉదహరిస్తున్నారు.
అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై కేడర్ కొట్టుకుందని, బహిరంగంగానే విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయసేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు.
కొందరు అభిప్రాయ సేకరణ జరపకుండానే..
కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయసేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతోపాటు వారికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో కూర్చొని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో సమర్థులైన వారికి ఈ పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు.
హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా (హైదరాబాద్ సెంట్రల్, మలక్‌పేట–భాగ్యనగర్, గోషామహల్– గోల్కొండ, మహంకాళి సికింద్రాబాద్) రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్, రూరల్ జిల్లాలు, ఇలా వివిధ జిల్లా శాఖలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment