కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? | CM Jagan Doing Lot Of Good To BCs With Welfare Schemes | Sakshi
Sakshi News home page

కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

Published Sun, Dec 4 2022 8:35 AM | Last Updated on Sun, Dec 4 2022 8:36 AM

CM Jagan Doing Lot Of Good To BCs With Welfare Schemes - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల(బీసీల)ను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యం’ అని 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన మాటలను ఈ మూడున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరించి చూపారు. ఈ వర్గాల పిల్లల ఉన్నత చదువులకు అండగా నిలిచారు. వారి కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకు వినూత్న మార్గాల్లో కృషి చేశారు. ఫలితంగా బీసీలు అన్ని రంగాల్లో ప్రగతిపథం దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
చదవండి: 'నేనున్నాను'.. మీకేం కాదు

సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత, రాజ్యాధికారంలో సింహ భాగం వాటా.. విద్యా దీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజల(బీసీ)ను సమాజానికి వెన్నెముకగా మార్చే దిశగా మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.

దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం ఇవ్వని రీతిలో సీఎం వైఎస్‌ జగన్‌ రాజ్యాధికారంలో బీసీ వర్గాలకు సింహభాగం వాటా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో మూడున్నరేళ్లలో రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే.. ఇందులో బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు మాత్రమే రూ.85,915.06 కోట్లు ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ బీసీలను సమాజానికి వెన్నెముకగా మార్చడానికి బాటలు వేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవులు 
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్‌ చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఏకంగా చట్టం తెచ్చారు. 
రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. 
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా  56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు. 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201 పదవులు బీసీలకు (42 శాతం) ఇచ్చారు.

పరిపాలనలో భాగస్వామ్యం సింహభాగం
1. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన నిర్వహించింది. ఈ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్‌ రూపంలో వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు.

2. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్‌సీపీ  చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్‌ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 11న పునర్‌ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులు ఉన్న మంత్రివర్గంలో ఏకంగా పది మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలను ఆ వర్గాల వారికే అప్పగించారు.

3. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే అందులో సింహభాగం బీసీలే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు గాను, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు.

4. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్‌ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు.

5. పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో సింహభాగం బీసీలకే అవకాశం కల్పించారు. 

6. మండల పరిషత్‌ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను దక్కించుకుంది. ఇందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. 

7. 13 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తే.. ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ఇందులో బీసీలకు సింహభాగం ఇచ్చారు. 

8. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ఇందులో బీసీలకు అధిక భాగం పదవులు ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ వెంటే బీసీలు
టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఆ వర్గాల వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక బీసీలకే వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గంలో కేవలం బీసీ వర్గాల నుంచి ఆరుగురికే అవకాశం కల్పించారు. అదే సమయంలో 11 మంది ఓసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా చంద్రబాబు పంపలేదు.

తమ హక్కులను పరిరక్షించాలని అడిగిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తరిస్తానని.. తమ సమస్యలు పరిష్కరించాలని అర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి.. అడుగడుగునా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన చంద్రబాబుపై బీసీలు ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లును వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టడం.. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడమని చెబుతున్నారు. బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలడానికి సైతం ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement