సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ స్పీడ్ పెంచింది. జాతీయ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేములవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.
వేములవాడలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. అందుకే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కేసీఆర్‌కు మజ్లీస్ నేత ఒవైసీ అంటే భయం. అందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంల లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు. అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసింది. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణ పరిస్థితే గతంలో ఉండేది. కానీ, ఇప్పుడు యూపీలో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది. ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా నిలిచాం. తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే.
డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశం గొప్పతనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్‌ను దృఢంగా నిల్పిన ఘనత మోదీది. ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు. వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్‌ను గెలిపించాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment