Vemulawada Assembly Constituency
-
కేసీఆర్‌కు ఒవైసీ అంటే భయం: సీఎం యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ స్పీడ్ పెంచింది. జాతీయ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేములవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వేములవాడలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. అందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కేసీఆర్‌కు మజ్లీస్ నేత ఒవైసీ అంటే భయం. అందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంల లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు. అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసింది. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణ పరిస్థితే గతంలో ఉండేది. కానీ, ఇప్పుడు యూపీలో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది. ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా నిలిచాం. తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశం గొప్పతనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్‌ను దృఢంగా నిల్పిన ఘనత మోదీది. ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు. వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్‌ను గెలిపించాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, బీజేపీ నాయకురాలు తుల ఉమ సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం తుల ఉమతో పాటు ఆమె వెంట వచ్చిన నేతలను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు మరింత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, వేములవాడ టికెట్ విషయంలో మరొకరికి దొంగదారిలో బీ ఫారం ఇచ్చారని తుల ఉమ అన్నారు. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి కల అని, కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాత్రమే ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సుదగోని హరిశంకర్‌గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హరిశంకర్‌గౌడ్‌తో పాటు పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మేడబోయిన పరశురాములు, ఉదయకిరణ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులను కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వనించారు. నల్లగొండ డీసీసీబీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్లోకి పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి, తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో అర్ధంకాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్‌రెడ్డికి మునుగోడులో బుద్ధి చెప్పాలన్నారు. గౌరవం లేనిచోట ఉండకూడదనే తన తండ్రి మాటలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను వీడినట్లు పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. -
Assembly Elections: వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో..
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ కష్టం రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలే ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఓ యువనేత చాలా కష్టాలు పడుతున్నారట. తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఆ అభ్యర్థి కోసం ప్రయోగిస్తున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆ యువనేత ఎవరు? తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్‌కు పక్కనే ఉన్న నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కల్వకుంట్ల తారకరాముడు నానా కష్టాలు పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు టిక్కెట్ నిరాకరించిన గులాబీ పార్టీ బాస్ చల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించారు. టిక్కెట్ వచ్చినప్పటినుంచే చల్మెడకు కష్టాలు మొదలయ్యాయి. తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌బాబు పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉధృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తన పక్క నియోజకవర్గమే కావడంతో ఇప్పుడు వేములవాడ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేములవాడలో చల్మెడకు విజయం చేకూర్చండి...నేనే దత్తత తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చల్మెడను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా.. చల్మెడను కాదు.. కేసీఆర్‌ను చూసి గెలిపించండి..అంటూ వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. స్వయంగా ఆయనే వేములవాడలో పోటీ చేస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ చేసిన ప్రసంగం విన్నవారు...అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆయనే బయటపెట్టారా అనే చర్చ ప్రారంభించారు. చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు సహాయ నిరాకరణ..పార్టీ అభ్యర్థి చల్మెడ తీరు.. ప్రజలతో కలిసే విషయంలోనూ.. ముఖ్యంగా క్యాడర్ ను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా వెనుకబడి పోవడంతో.. చల్మెడ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నాల్గుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నేత ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆది శ్రీనివాస్ మీద సానుభూతి పవనాలు వీయడంతో పాటు.. కాంగ్రెస్ వేవ్ కొంత కనిపిస్తుండటం.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మరింత కష్టిస్తేగానీ.. కనీసం ఫైట్‌లో ఉండే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనతలు.. మరోవైపు స్థానిక నేతలు జీర్ణించుకోలేని స్థాయిలో ఆయన వైఖరి.. కేటీఆర్ మీటింగ్ అయిపోయిందో, లేదో.. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరగణం కావడం విశేషం. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పెద్దగా ప్రభావితం చేయగల నేత కాకపోవడంతో పాటు.. ఆయన వైఖరి నచ్చక చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అందుకే తన పక్క నియోజకవర్గమైన వేములవాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తారకరాముడికి తలబొప్పి కట్టినంత పనవుతోంది. అయితే యువసమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసాయి. చల్మెడను గెలిపించకపోతే వేములవాడ రానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ అభ్యర్థి చల్మెడ నిస్సహాయతను తెలియచేస్తోందని అంటున్నారు. మరి చివరకు వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో చూడాలి.. -
కేసీఆర్ అపాయింట్మెంట్.. నో ఇంట్రెస్ట్?
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే.. వేములవాడలో రాజకీయాలు కాస్త ప్రత్యేకంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టేయడంతో.. ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం అపాయింట్ మెంట్ దక్కినా చెన్నమనేని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు కాకుండా.. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. చెన్నమనేని మంచి లీడర్ అని, కానీ, పౌరసత్వ వివాదం ఉన్నందునే ఆయన పక్కకి పెడుతున్నట్లు ఆవేదనపూరితంగానే కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారుగా చెన్నమనేనిని నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఈ నియామకంగాపై చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపే క్రమంలోనే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినా వెళ్లలేదని స్పష్టమవుతోంది. చల్మెడకు నో సపోర్ట్! వేములవాడలో ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయం గందరగోళంగా తయారైంది. టికెట్ ప్రకటన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇక తమ రాజకీయ వారసత్వానికి గండి పడటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో చెన్నమనేని ఉన్నారు. అదే సమయంలో చెల్మెడ్కు మద్దతుగా వచ్చిన నాయకులపైనా ఆయన రుసరుసలాడినట్లు తెలుస్తోంది. మీరు చేస్తున్న బ్యాక్ డోర్ పాలిటిక్స్‌తో ప్రత్యర్థి పార్టీ నాయకుడి గెలుపు ఖాయం అంటూ చెన్నమనేని తనను కలిసేందుకు వచ్చిన నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి చల్మెడకు అంతగా మద్దతు దొరకడం లేదు. మరోవైపు రమేష్ బాబుకు పార్టీకి మించిన మద్దతు ఉందక్కడ. ఈ నేపథ్యంలో.. చెన్నమనేని తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. చెన్నమనేనికి కీలక పదవి
సాక్షి, వేములవాడ: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి టికెట్ దక్కని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ చెన్నమనేని రమేష్ బాబును ఈ పదవిలో నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సీఎంవో తెలిపింది. ఇదిలా ఉండగా.. చెన్నమనేనిని కాదని చల్మెడ లక్ష్మీనర్సింహారావును టికెట్ ప్రకటించడంతో వేములవాడ బీఆర్ఎస్లో అలజడి చోటుచేసుకుంది. దీంతో చెన్నమనేని మద్దతుదారులు నిరాశకు గురయ్యారు. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రమేశ్ బాబు తన ఫేస్బుక్ ఖాతాలో రాజకీయాలు ప్రజల కోసం తప్ప పదవుల కోసం చేయొద్దంటూ తన తండ్రి రాజేశ్వర్‌రావు మాటలను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్.. చెన్నమనేనిని కీలక పదవి ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయంతో వేములవాడలో చల్మెడ ప్రచారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇది కూడా చదవండి: తుమ్మల ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ -
వేములవాడ: బీఆర్ఎస్పై ‘రాజన్న’ ప్రభావం..!
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేములవాడ 2009లో ఏర్పడింది. 2009లో మహాకూటమిలో భాగంగా వేములవాడ నుండి టిడిపి పార్టీ నుండి చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్‌పై 1821 ఓట్లతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో తెలంగాణ ఇచ్చినట్లుగానే ఇచ్చి వెనక్కి తీసుకున్న నెపంతో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన రమేశ్ బాబు టీ(బీ)ఆర్ఎస్ పార్టీ నుండి 2010లో ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలిచారు... .. 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు పోటీ చేయగా బిజెపి నుండి బరిలో ఉన్న ఆది శ్రీనివాస పై 5 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు. వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొమ్మ వెంకటేశ్వర్లు 14 వేల వరకు ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన ప్రత్యర్థిగా ఆది శ్రీనివాస్ మాత్రమే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దేని నుండి పోటీ చేసిన ప్రత్యర్థిగా కనిపిస్తున్నాడు అది. చెన్నమనేని రమేశ్ బాబు తండ్రి రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపికి దాదాపు 20 వేల పైగా ఈ నియోజకవర్గం నుండి వచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో ముఖ్యంగా కోనరావుపేట మండలం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది. బిజెపి నాయకుడు చిన్నమనేని విద్యాసాగర్ రావు అలాగే లక్ష్మి నరసింహ రావు రమేష్ బాబు మండలం కోనరావుపేట కావడంతో ఆసక్తి నెలకొంది. అత్యంత ప్రభావితం చేసే గ్రామంగా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామం ఉంది. కనీసం అత్తగారి గ్రామాన్ని కూడా పట్టించుకోని కేసీఆర్: ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. దాంతోపాటు మండలంలో ప్రధానంగా ఎనిమిది ముంపు గ్రామాలు ఉండగా..వాటికి ఇవ్వవలసిన ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు గ్రామమైన కొదురుపాక గ్రామాన్ని కూడా పట్టించుకోలేదనే వాదన ఉంది. ఈ గ్రామం కూడా ముంపు గ్రామాల్లో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాదు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం BRS పార్టీకి మైనస్‌గా అనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి గతం నుండి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజన్న అభివృద్ధి ఏది? వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అలాగే చెలిమెడ లక్ష్మీనరసింహారావు మనోహర్ రెడ్డి ఎన్నారై గోలి మోహన్ టికెట్ ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ అభివృద్ధి చేయకపోవడం బి ఆర్ ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు, అలాగే కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటున్న గోలి మోహన్ టికెట్ ఆశిస్తుండగా సీనియర్ నేతగా మనోహర్ రెడ్డి టికెట్ రేసు లో ఉన్నాడు, ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని అభ్యర్థి ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి పార్టీలో త్రిముఖ పోటీ? బిజెపి పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో భాజాప సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు అలాగే ప్రతాపరామకృష్ణుడు సీనియర్ నేత తుల ఉమా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి చేయని అభివృద్ధిని క్యాష్ చేసుకొని ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో నిలిచి గెలుపు బాటలో ఉండాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం ఆది శ్రీనివాస మాత్రమే బరిలో ఉంటున్నాడు. రెబల్ బెడద్ కూడా లేకపోవడంతో, కాంగ్రెస్ టికెట్ ఆది శ్రీనివాసకి కన్ఫాం చేస్తున్నట్టు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు: వేములావాడ నియోజకవర్గం లో ప్రధాన ఆలయం రాజన్న ఆలయంగా చెప్పవచ్చు,నాంపల్లి పర్యాటక కేంద్రంగా ఉంది గతంలో బీజేపి ఎంపీ గా ఉన్నప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు నాంపల్లిని పర్యాటక కేంద్రంగా చేసారు. అధికార పార్టీపై ‘రాజన్న’ ప్రభావం ముఖ్యంగా రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 100 కోట్లు అభివృద్ధికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, గ్రామాల ప్రజలను పట్టించుకోకపోవడం వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు. -
వేములవాడ నియోజకవర్గం చరిత్ర ఇదే..
వేములవాడ నియోజకవర్గం వేముల వాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ నాలుగోసారి విజయం సాదించారు. ఒకసారి టిడిపి నుంచి, ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. ఆయన జర్మని పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదం ఉన్నప్పటికీ, దానిని అదిగమించి గెలుస్తుండడం విశేషం. ఆయన తండ్రి, సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే తండ్రి, కొడుకులు పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నమాట. చెన్నమనేని రమేష్ ఈసారి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఆది శ్రీనివాస్‌పై 28186 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రమేష్‌కు 84040 ఓట్లు, ఆది శ్రీనివాస్‌కు 55864 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగుసార్లు ఇక్కడ వీరిద్దరే ప్రదాన ప్రత్యర్దులుగా ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్ది ప్రతాప్ రామకృష్ణకు సుమారు 5500 ఓట్లు వచ్చాయి. రమేష్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈయనే గెలుపొందుతున్నారు. వేములవాడ, అంతకుముందు నియోజకవర్గంగా ఉండి రద్దయిన మెట్ పల్లి నియోజకవర్గంలో కలిపి పన్నెండు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు ఎన్నిక కాగా, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బిసిలు, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు బిజెపి పక్షాన పోటీ చేయగా, స్వయాన ఆయన అన్న రాజేశ్వరరావు కుమారుడు అయిన రమేష్ టిడిపి తరుపున రంగంలో దిగారు. రమేష్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందగా, విద్యాసాగరరావు మూడోస్థానంలో మిగిలారు. విద్యాసాగరరావు 2010 ఉప ఎన్నికలో రమేష్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. విద్యాసాగర్‌రావు గతంలో మెట్పల్లి నుంచి మూడుసార్లు శాసనసభకు, రెండుసార్లు కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలుపొందారు. 2014లో లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. వాజ్‌పేయి క్యాబినెట్లో హోం శాఖ సహాయ మంత్రిగా విద్యాసాగర్ రావు వున్నారు. తదుపరి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. రాజేశ్వరరావు ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985, 94లలో వేర్వేరు పక్షాల తరుఫున అన్నదమ్ములు రాజేశ్వరరావు, విద్యాసాగరరావులు శాసనసభలో ఉన్నారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో సిహెచ్ సత్యనారాయణ రావు రెండుసార్లు, వర్ధినేని వెంకటేశ్వరరావు రెండుసార్లు గెలుపొందారు. 1998 ఉప ఎన్నికలో గెలుపొందిన కొమిరెడ్డి జ్యోతి, 2004లో గెలుపొందిన రాములు భార్యభర్తలు. మెట్‌పల్లికి 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిపి ఐదుసార్లు, భారతీయ జనతా పార్టీ నాలుగుసార్లు, జనతా ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఇక్కడ గెలిచినవారిలో వర్ధినేని వెంకటేశ్వరరావు 1981 నుంచి అంజయ్య, భవనం, కోట్ల క్యాబినెట్లలో పనిచేసారు. వేములవాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..