
సాక్షి, వేములవాడ: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి టికెట్ దక్కని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ చెన్నమనేని రమేష్ బాబును ఈ పదవిలో నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సీఎంవో తెలిపింది.
ఇదిలా ఉండగా.. చెన్నమనేనిని కాదని చల్మెడ లక్ష్మీనర్సింహారావును టికెట్ ప్రకటించడంతో వేములవాడ బీఆర్‌ఎస్‌లో అలజడి చోటుచేసుకుంది. దీంతో చెన్నమనేని మద్దతుదారులు నిరాశకు గురయ్యారు. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రమేశ్ బాబు తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలు ప్రజల కోసం తప్ప పదవుల కోసం చేయొద్దంటూ తన తండ్రి రాజేశ్వర్‌రావు మాటలను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్.. చెన్నమనేనిని కీలక పదవి ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయంతో వేములవాడలో చల్మెడ ప్రచారానికి లైన్ క్లియర్ అయ్యింది.
ఇది కూడా చదవండి: తుమ్మల ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment