వేములవాడ నియోజకవర్గం
వేముల వాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ నాలుగోసారి విజయం సాదించారు. ఒకసారి టిడిపి నుంచి, ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు టిఆర్‌ఎస్ పక్షాన గెలుపొందారు. ఆయన జర్మని పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదం ఉన్నప్పటికీ, దానిని అదిగమించి గెలుస్తుండడం విశేషం. ఆయన తండ్రి, సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే తండ్రి, కొడుకులు పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నమాట. చెన్నమనేని రమేష్ ఈసారి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఆది శ్రీనివాస్‌పై 28186 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
రమేష్‌కు 84040 ఓట్లు, ఆది శ్రీనివాస్‌కు 55864 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగుసార్లు ఇక్కడ వీరిద్దరే ప్రదాన ప్రత్యర్దులుగా ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్ది ప్రతాప్ రామకృష్ణకు సుమారు 5500 ఓట్లు వచ్చాయి. రమేష్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈయనే గెలుపొందుతున్నారు. వేములవాడ, అంతకుముందు నియోజకవర్గంగా ఉండి రద్దయిన మెట్ పల్లి నియోజకవర్గంలో కలిపి పన్నెండు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు ఎన్నిక కాగా, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బిసిలు, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు బిజెపి పక్షాన పోటీ చేయగా, స్వయాన ఆయన అన్న రాజేశ్వరరావు కుమారుడు అయిన రమేష్ టిడిపి తరుపున రంగంలో దిగారు.
రమేష్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందగా, విద్యాసాగరరావు మూడోస్థానంలో మిగిలారు. విద్యాసాగరరావు 2010 ఉప ఎన్నికలో రమేష్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. విద్యాసాగర్‌రావు గతంలో మెట్పల్లి నుంచి మూడుసార్లు శాసనసభకు, రెండుసార్లు కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలుపొందారు. 2014లో లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో హోం శాఖ సహాయ మంత్రిగా విద్యాసాగర్ రావు వున్నారు. తదుపరి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. రాజేశ్వరరావు ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
1985, 94లలో వేర్వేరు పక్షాల తరుఫున అన్నదమ్ములు రాజేశ్వరరావు, విద్యాసాగరరావులు శాసనసభలో ఉన్నారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో సిహెచ్ సత్యనారాయణ రావు రెండుసార్లు, వర్ధినేని వెంకటేశ్వరరావు రెండుసార్లు గెలుపొందారు. 1998 ఉప ఎన్నికలో గెలుపొందిన కొమిరెడ్డి జ్యోతి, 2004లో గెలుపొందిన రాములు భార్యభర్తలు. మెట్పల్లికి 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిపి ఐదుసార్లు, భారతీయ జనతా పార్టీ నాలుగుసార్లు, జనతా ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఇక్కడ గెలిచినవారిలో వర్ధినేని వెంకటేశ్వరరావు 1981 నుంచి అంజయ్య, భవనం, కోట్ల క్యాబినెట్‌లలో పనిచేసారు.
వేములవాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment