సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే.. వేములవాడలో రాజకీయాలు కాస్త ప్రత్యేకంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టేయడంతో.. ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం అపాయింట్ మెంట్ దక్కినా చెన్నమనేని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు కాకుండా.. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్ అధిష్టానం. చెన్నమనేని మంచి లీడర్ అని, కానీ, పౌరసత్వ వివాదం ఉన్నందునే ఆయన పక్కకి పెడుతున్నట్లు ఆవేదనపూరితంగానే కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారుగా చెన్నమనేనిని నియమించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం.
అయితే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఈ నియామకంగాపై చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపే క్రమంలోనే ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చినా వెళ్లలేదని స్పష్టమవుతోంది.
చల్మెడకు నో సపోర్ట్!
వేములవాడలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ రాజకీయం గందరగోళంగా తయారైంది. టికెట్ ప్రకటన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయాయి బీఆర్‌ఎస్ శ్రేణులు. ఇక తమ రాజకీయ వారసత్వానికి గండి పడటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో చెన్నమనేని ఉన్నారు. అదే సమయంలో చెల్మెడ్‌కు మద్దతుగా వచ్చిన నాయకులపైనా ఆయన రుసరుసలాడినట్లు తెలుస్తోంది.
మీరు చేస్తున్న బ్యాక్ డోర్ పాలిటిక్స్‌తో ప్రత్యర్థి పార్టీ నాయకుడి గెలుపు ఖాయం అంటూ చెన్నమనేని తనను కలిసేందుకు వచ్చిన నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి చల్మెడకు అంతగా మద్దతు దొరకడం లేదు. మరోవైపు రమేష్ బాబుకు పార్టీకి మించిన మద్దతు ఉందక్కడ. ఈ నేపథ్యంలో.. చెన్నమనేని తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment