కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన సీఎం జగన్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ గెస్టుహౌస్‌లో అబ్దుల్ సలామ్ అత్త మాబున్నీసా, ఆమె కూతురు సాజిదా, కుమారుడు షంషావలిని కలిశారు. తొలుత వారు తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పది రోజుల క్రితమే మాబున్నీసాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అందజేసిన విషయం తెలిసిందే.
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
► తన కూతురు, అల్లుడు, వారి ఇద్దరి పిల్లల మరణానికి కారణమైన పోలీసులను కఠినంగా శిక్షించాలని, తన రెండో కుమార్తె సాజిదాకు ఉద్యోగం ఇవ్వాలని, అనంతపురం వైద్య, ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న తన కుమారుడు షంషావలిని నంద్యాలకు బదిలీ చేయాలని మాబున్నీసా సీఎంను కోరారు.
► సలామ్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్పను సీఎం ఆదేశించారు. సాజిదాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వా లని, షంషావలిని అనంతపురం నుంచి నం ద్యాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్‌ను ఆదేశించారు.
► ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా తనను కలవాలని సీఎం వారికి భరోసా ఇచ్చారు.
► కాగా, మాబున్నీసా కుమారుడు షంషావలిని అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి నంద్యాల జిల్లా ఆసుపత్రికి వెనువెంటనే బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. సాజిదాకు కూడా కొద్ది రోజుల్లోనే ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు.
ధైర్యంగా ఉండండి.. అన్ని విధాలా ఆదుకుంటాం
Published Sat, Nov 21 2020 4:27 AM | Last Updated on Sat, Nov 21 2020 7:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment