CM YS Jagan: బాధ్యత పెంచిన గెలుపు | CM YS Jaganmohan Reddy Comments On Parishad Election Results Camp Office | Sakshi
Sakshi News home page

CM YS Jagan: బాధ్యత పెంచిన గెలుపు

Published Tue, Sep 21 2021 2:18 AM | Last Updated on Tue, Sep 21 2021 1:31 PM

CM YS Jaganmohan Reddy Comments On Parishad Election Results Camp Office - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, శ్రీ రంగనాథరాజు తదితరులు

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు చేకూర్చిన అఖండ విజయం రాష్ట్ర ప్రభుత్వంపైన, తనపైనా బాధ్యత మరింత పెంచిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌సీపీకి ఎంపీటీసీల్లో 86 శాతం, జెడ్పీటీసీల్లో 98 శాతం స్థానాల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలనుద్దేశించి సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడారు. కొన్ని అన్యాయమైన మీడియా సంస్థలు టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ విజయానికి వక్రభాష్యం చెబుతూ తప్పుడు రాతలు రాస్తున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల పరంగా, పార్టీల గుర్తుపై జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీటీపీ పోటీ చేసినప్పటికీ బహిష్కరించినట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ సునాయాస విజయంగా ఈనాడు పత్రిక వక్రభాష్యం రాసిందని, ఇలాంటి అన్యాయమైన ఈనాడు లాంటి పత్రిక ప్రపంచంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ అక్కచెల్లెమ్మ, సోదరుడికి ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంత ఘన విజయం అందించిన ప్రతీ తాత, అవ్వ, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియచేశారు. గతంలో ఎన్నడూ లేని అపూర్వ విజయం అదించిన ప్రజలకు సదా రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

మీ చల్లని దీవెనలతో మొదలైంది..
ఈరోజు మీరు చేకూర్చిన అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింత పెంచింది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాలకుగానూ 22 చోట్ల గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంట్‌ సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైంది.

పంచాయతీల్లోనూ అదే ఆదరణ..
ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,081 పంచాయతీలకుగానూ 10,536 చోట్ల అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో అధికార పార్టీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారు.

పట్టణ స్థానిక సంస్థల్లో ప్రభంజనం..
దాని తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. 75 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏకంగా 74 చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ఆదరించారు. 99 శాతం స్థానాల్లో విజయం చేకూర్చారు. ఇక 12 చోట్ల మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 12కి 12 చోట్ల వంద శాతం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు.

ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లోనూ..
ఆ తర్వాత నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకుగానూ 8,249 ఎంపీటీసీలు.. అంటే 86 శాతం ఎంపీటీసీల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించారు. 638 జడ్పీటీసీలకుగానూ 628 జడ్పీటీసీలు (సీఎం సమీక్ష జరుగుతున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం. ఆ తరువాత ఇవి 630కి పెరిగాయి) అంటే 98 శాతం జడ్పీటీసీలను దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో సాధించాం.

95 శాతానిపైగా హామీలు అమలు..
ప్రతి ఎన్నికలోనూ ఎక్కడా కూడా సడలని ఆప్యాయత, ప్రేమానురాగాలతో ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు. దేవుడి దయ వల్ల ఈ రెండున్నరేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతానికి పైగా అమలు చేయగలిగాం. అందరి మన్ననలు పొందగలిగాం. ఇందుకు ప్రజలందరికీ సదా రుణపడి ఉంటాం.

అవరోధాలు, ఇబ్బందులు..
కానీ ఇక్కడ కొన్ని విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నా. ప్రభుత్వానికి అవరోధాలు, ఇబ్బందులు కల్పించాలని కొన్ని శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు కోవిడ్‌తో డీల్‌ చేస్తున్నాం. మరోవైపు దుష్ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షంతోపాటు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ– 5 లాంటి అన్యాయమైన మీడియా సంస్థలున్నాయి. అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నిస్తూ రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నాయి. కేవలం వాళ్లకు సంబంధించిన మనిషి అధికార పీఠంపై కూర్చోలేదు కాబట్టి, ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ముఖ్యమంత్రిని దించేసి వాళ్ల మనిషిని కూర్చోబెట్టాలనే దుర్మార్గపు బుద్ధితో చంద్రబాబును భుజాన వేసుకుని నడుస్తున్నాయి.

ప్రజా దీవెనను జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు
ఈ ఎన్నికల్లోనే కాదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 2019 ఎన్నికల్లో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 88 శాతం ఎంపీ సీట్లతో ప్రయాణాన్ని ప్రారంభించి సర్పంచ్‌ ఎన్నికల్లో 81 శాతం పార్టీ మద్దతుదారులే విజయం సాధించడం, మున్సిపల్‌ ఎన్నికల్లో 99 శాతం, వంద «శాతం కార్పొరేషన్లను గెలుచుకోవడం, ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 86 శాతం, 98 శాతంతో ప్రజలు వైఎస్సార్‌ సీపీకి ఘన విజయాన్ని చేకూర్చడాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు రాస్తున్నారు.

పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలకు వక్రభాష్యాలా?
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే పార్టీల గుర్తులతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఇంత బాగా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని దీవిస్తే అది మింగుడు పడక విపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా వక్రభాష్యాలు చెబుతున్నాయి. ఇవి సాక్షాత్తూ పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు. పార్టీ రహిత ఎన్నికలు కావు. పార్టీల గుర్తుతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ వారి అభ్యర్థులకు ఏ ఫామ్స్, బీ ఫామ్స్‌ కూడా ఇచ్చాయి. వాటి ఆధారంగా అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. 

ఏ స్థాయిలో అడ్డుకుంటున్నారో మీరే చూస్తున్నారు..
ఓటమిని అంగీకరించలేరు. వాస్తవాలను ఒప్పుకోరు. ఇటువంటి అన్యాయమైన మీడియా సామ్రాజ్యం, ప్రతిపక్షం నడుమ ప్రజలకు మేలు చేయడానికి అడుగులు వేస్తుంటే మంచి జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తున్నారు. ప్రజలకు ఏ కాస్త మంచి జరుగుతున్నా వెంటనే తప్పుడు వార్తలు, కోర్టులో కేసులు వేయడం ద్వారా అడ్డుకుంటున్న పరిస్థితులను అంతా చూస్తున్నాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తోందని సవినయంగా తెలియచేస్తున్నా. 

ఏడాదిన్నర క్రితమే పూర్తై ఉంటే..
ఈ ఎన్నికల ప్రక్రియ నిజానికి ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదలైంది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రయత్నం చేశారు. వాయిదా వేయించారు. కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తెచ్చారు. చివరకు ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్‌ కూడా ఆర్నెళ్ల పాటు వాయిదా వేయించారు. ఇవే ఎన్నికలు ఏడాదిన్నర క్రితమే పూర్తై ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే కోవిడ్‌ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగేదన్న ఇంగితజ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులను చూశాం.

మరింత కష్టపడి మంచి చేస్తాం..
ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇవాళ కష్టపడుతున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ శ్రమించి ప్రజలకు మరింత మేలు చేస్తామని హామీ ఇస్తున్నా.

ఇదెక్కడి పీడ..?
ఈరోజు ఆశ్చర్యకరమైన ఓ వార్త చూశా. విపక్షం ఓడిపోయిన తర్వాత కనీసం ఓటమిని కూడా హుందాగా అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్‌ ఉంది. ‘పరిషత్‌ ఏకపక్షమే.. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం...’ అని రాశారు. నిజంగా ఇది పేపరా? ఇదేమన్నా పేపర్‌కు పట్టిన పీడా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో...!
– సీఎం జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement