సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు దాటినా బీజేపీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగడం లేదు. బుధవారం ఒక్క రోజే పార్టీ కార్యాలయానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. గత నెల 3న అసెంబ్లీ ఫలితాలు ప్రకటించిన దరిమిలా మొదలైన పితూరీల పరంపర నేటికీ ఆగలేదని అంటున్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఫిర్యాదులు రావడం, చిన్న కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కంప్లెయింట్స్ సమర్పించిన వారిలో ఉండడం చూసి పార్టీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారట.
నెలాఖరులోగా ఫిర్యాదుల పరిష్కారం?
ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ప్రత్యర్థి పార్టీకి, అభ్యర్థులకు సహకరించారని, పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యారని, ఇలా వివిధ స్థాయిల్లో నాయకులపై ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కొద్దిమంది నేతలు తమకు పార్టీలో ఇతరులతో ఉన్న వ్యక్తిగత కక్షలు, ద్వేషాల నేపథ్యంలో కూడా ఫిర్యాదులు పంపినట్టు చెబుతున్నారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రమశిక్షణా కమిటీకి చైర్మన్ ఎం.ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ కమిటీ గతనెల 30 తొలి సారి భేటీ కాగా, ఫిర్యాదులపై విచారణను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారీగా ఫిర్యా దులు వెల్లువెత్తుతుండడంతో కమిటీ ప్రతీవారం భేటీ అయి వీలైనంత వేగంగా వాటిని పరిష్కరించాలని భావిస్తోంది.
ఇప్పటికే కొందరికి షోకాజ్‌లు జారీ...
క్రమశిక్షణా కమిటీ మొదటి సమావేశంలో...ఎన్నికల్లో పా ర్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి, ఎన్నికల బాధ్యతలు సరిగా నిర్వహించ ని వారికి, నిర్లక్ష్యం వహించి పార్టీకి నష్టం చేసిన పలువురికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. వారం, పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ శ్రీముఖాలు అందుకున్న వారిలో ఇద్దరు ముగ్గు రు జిల్లా అధ్యక్షులు, పదిమంది వరకు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారని తెలిసింది. వీరిపై ఆరోపణల తీవ్రతను బట్టి చర్యలకు దిగనున్నట్టు తెలుస్తోంది.
ఇక మరికొన్ని ఫిర్యాదులపై అదనపు సమాచారాన్ని కోరినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించారనే తీవ్రమైన ఆరోపణలు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న దానిపై కచ్చితమైన ఆధారాలు, సమాచారం ఇస్తే సస్పెన్షన్లు, బహిష్కరణలు వంటి తీవ్ర నిర్ణయాలు కమిటీ తీసుకునే అవకాశాలున్నాయని పార్టీనేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment