సాక్షి, హైదరాబాద్: తన అంచనా ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి దోపిడీ, అక్రమార్జనలపైనే దృష్టి పెట్టిందని, అందుకే ఈసారి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.
హుజూర్‌నగర్ అసెంబ్లీ టికెట్‌కోసం శుక్రవారం గాందీభవన్‌లో దరఖాస్తు ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని బీఆర్‌ఎస్ నేతలు చెపుతున్నారని, వారు చెపుతున్నట్టుగానే తలసరి అప్పు, మద్యం వినియోగం, అవినీతిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతలు వాటిని తమ సామ్రాజ్యాలుగా భావించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకముందే లంచాలు తీసుకుంటున్నారని, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో దళితబంధుకు అర్హత పొందిన వారి వద్ద నుంచి 50 శాతం కమీషన్ తీసుకున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment