![Congress KC Venu Gopal Offers Minister Post To MLC Jeevan Reddy](/styles/webp/s3/article_images/2024/06/25/MLC-Jeevan.jpg.webp?itok=kSktr3gV)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘జగిత్యాల జగడం’ హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవడంతో ఆయనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఫోన్‌తో మాట్లాడించారు. కాగా, వేణుగోపాల్‌తో జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంద్భంగా కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.
అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి రాగానే నా నిర్ణయం చెబుతాను. తొందరలోనే మండలి ఛైర్మన్ దగ్గరికి వస్తాను. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ నాతో మాట్లాడారు. సీనియర్ నాయకులు, సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. పార్టీతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. జరిగిన పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. మండలి ఛైర్మన్‌ను సమయం అడిగాను అంటేనే మీరు ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులంతా గాంధీభవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలవాలన్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా క్రియేట్ అయ్యింది. నిన్న(సోమవారం) కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment