‘ఆపరేషన్‌ బొగ్గు’..  సాక్ష్యాలివిగో.. వివరాలు వెల్లడించిన మధుయాష్కీ | Congress Leader Madhu Yashki Goud Slams Komatireddy Rajgopal Reddy | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ బొగ్గు’..  సాక్ష్యాలివిగో.. వివరాలు వెల్లడించిన మధుయాష్కీ

Published Mon, Oct 31 2022 1:37 AM | Last Updated on Mon, Oct 31 2022 1:17 PM

Congress Leader Madhu Yashki Goud Slams Komatireddy Rajgopal Reddy - Sakshi

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న మధుయాష్కీ. చిత్రంలో కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, కొండా సురేఖ, బోరెడ్డి అయోధ్యారెడ్డి తదితరులు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జార్ఖండ్‌లోని చంద్రగుప్త బొగ్గు గని ప్రాజెక్ట్‌ దక్కించుకునేందుకు తల్లిలాంటి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం పెద్దాయపల్లి గేట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి తన వ్యాపార విస్తరణ కోసం మునుగోడు ప్రజలను మోసం చేశాడనడానికి సాక్ష్యాలివిగో అంటూ ప్రతులు చూపిస్తూ వివరాలు వెల్లడించారు.

‘ఆపరేషన్‌ బొగ్గు’అంటూ మధుయాష్కీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రగుప్త బొగ్గుగని ప్రాజెక్ట్‌ను రూ.3,437 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్‌తో దొడ్డిదారిన రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా దాదాపు ఐదురెట్లకిపైగా రూ.18 ,264 కోట్ల లాభం వస్తుంది. వాస్తవానికి 2019లో కోల్‌కతా హైకోర్టు సుశి ఇన్‌ఫ్రాటెక్‌ను బ్యాంక్‌ డిఫాల్టర్‌గా ప్రకటించింది.

అలాంటి కంపె నీకి చంద్రగుప్త ప్రాజెక్ట్‌ను బీజేపీ కేటాయించడంలో మతలబేంటో అందరికీ తెలుసు. కోల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా 2020 జూన్‌ 30న జార్ఖండ్‌లోని చంద్రగుప్త కోల్‌ ప్రాజెక్ట్‌కు మొదటి టెండర్‌ ప్రకటించింది. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్‌ఫ్రాటెక్‌ పాల్గొనలేదు. మొదటి టెండరు అదానీ గ్రూప్‌నకు దక్కినా.. దాన్ని రద్దుచేస్తూ 2021 జనవరిలో రెండోసారి టెండర్‌ ప్రకటించింది.

అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా ప్రకటనలిస్తూ లాబీయింగ్‌ చేశాడు. రెండో టెండరులో పాల్గొ న్న సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు 2021 ఫిబ్రవరి 3న చంద్రగు ప్త ప్రాజెక్ట్‌ కేటాయించారు. టెండర్‌ అలాటైనా ప్ర భుత్వం ఆ కంపెనీకి గని కేటాయించలేదు. దీంతో 2021 మార్చిలో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సందర్భంగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఫలితంగా 2021 డిసెంబర్‌లో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌తో జారీ జరిగింది. సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు కోల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కాంట్రాక్ట్‌ ఇచ్చినా.. ఒప్పందంలో జాప్యం జరుగుతుండగా ఈ ఏడాది మార్చి 17న బీజేపీలో చేరనంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించి పరోక్షంగా ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్‌ చేయించుకున్నారు.

పథకం ప్రకారం జరిగిన అగ్రిమెంట్‌.. 
‘ఈ బొగ్గు కుంభకోణంలో చర్చల పర్వం జనవరి 2021 నుంచి డిసెంబర్‌ 2021 వరకు జరిగింది. కాంట్రాక్ట్‌ వచ్చినంక ఒప్పందం ఆలస్యం అవుతుంటే జనవరి 2022 నుంచి జూలై 2022 వరకు మరో పర్వం కొనసాగింది. చివరకు జూలై 27న బీజేపీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. క్విడ్‌ప్రోకో కిందనే జార్ఖండ్‌లోని చంద్రగుప్త దక్కించుకున్నారు.

గతంలో సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు, తనకు సంబంధం లేదని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన భార్య, కూతురుకు 99.09శాతం షేర్లు ఉన్నాయి. అటువంటోడు ఆత్మగౌరవ పోరాటమంటడు.. మునుగోడు, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ అని మధుయాష్కీ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement