ఐజ్వాల్: బీజేపీ కంటే ఎక్కువగా, ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి 60 శాతం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. సోమవారం నుంచి మిజోరంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించారు.
‘ప్రతిపక్ష ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, విలువలను పరిరక్షిస్తూ, మతం, సంస్కృతులతో సంబంధం లేకుండా ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్చను, సామరస్యంగా జీవించే హక్కును పరిరక్షిస్తుంది. బీజేపీ కంటే కూడా ఎక్కువగా ఇండియా కూటమి దేశంలోని 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది’అని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మన దేశం పట్ల ఇండియా కూటమి ఆలోచనలు బీజేపీ, ఆర్‌ఎ స్‌ఎస్‌లతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి.
మేం వికేంద్రీకరణపై దృష్టి పెడితే బీజేపీ మాత్రం ఢిల్లీ నుంచే అన్ని నిర్ణయాలూ జరిగిపోవాలని అంటోంది. మేం అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో అత్యుత్తమమైన ఆరోగ్య విధానం, కర్ణాటకలో సామాజిక భద్రత కార్యక్రమాలు, ఛత్తీస్‌గఢ్‌లో వ్యాపార సానుకూల విధానాలు అమలవుతున్నాయి’అని రాహుల్ తెలిపారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇటువంటి విజయవంతమవుతున్న విధానాలనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
స్కూటరెక్కిన రాహుల్ గాంధీ
మిజోరంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ఐజ్వాల్‌లో స్కూటర్‌పై ప్రయాణించారు. మంగళవారం ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లాను ఇంటికెళ్లి కలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో స్కూటర్ ట్యాక్సీపై ప్రయాణించారు. నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణ ఎంతో బాగా ఉందని ప్రశంసలు కురిపించారు. ట్రాఫిక్ క్రమశిక్షణతో ఐజ్వాల్ ‘సైలెంట్ సిటీ’గా పేరు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment