Komatireddy Rajagopal Reddy: ‘హ్యాండ్‌’ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డి! | Congress MLA Komatireddy Rajagopal Reddy Comments on Party Change | Sakshi
Sakshi News home page

Komatireddy Rajagopal Reddy: ‘హ్యాండ్‌’ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డి!

Published Sat, Jul 23 2022 2:22 AM | Last Updated on Sat, Jul 23 2022 2:22 AM

Congress MLA Komatireddy Rajagopal Reddy Comments on Party Change - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రెండేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వెళ్తానని చాలారోజుల క్రితమే బహిరంగంగా ప్రకటించిన ఆయన ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ తర్వాత శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరిక అంశాన్ని తన అనుయాయులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కాంగ్రెస్‌పై రాజగోపాల్‌ రెడ్డి పెద్ద పిడుగు వేశారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

బీజేపీలో సీఎం అభ్యర్థిని...
ఏడాదిన్నర క్రితం ఒక రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని, తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని కార్యకర్తతో మాట్లాడిన ఆడియో రాజకీయంగా సంచలనం రేపింది. అప్పుడే బీజేపీలోకి వెళ్తారని భావించినా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వద్దని వారించినట్టు రాజగోపాల్‌ రెడ్డి గతంలో చెప్పారు. అయితే తాజాగా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైన ఆయన.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే బీజేపీయే కరెక్ట్‌అని, కాంగ్రెస్‌లో ఆ శక్తి కనిపించడంలేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించాలంటే బీజేపీయే సరైన పార్టీ అని భావిస్తున్నట్టు ఆయన తన అనుచరులకు చెప్పినట్టు తెలిసింది. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని, తన నియోజకవర్గ బాగోగుల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని చెప్పినట్టు సమాచారం. 

అకస్మాత్తుగా యూటర్న్‌!
పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితోపాటు పార్టీ అధిష్టానంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌కు రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అలా చెప్పిన ఆయన ఇంత అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకొని బీజేపీలోకి వెళ్లడం వెనుకున్న ఆంతర్యం ఏంటన్న దానిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ మారేందుకు శుక్రవారం మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో విందు భేటీ పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు దాన్ని రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి కీలక నేతలంతా రాజగోపాల్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాగా, ఆయన సోదరుడు, ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని, తాను చనిపోయినా.. తన మృతదేహంపై కాంగ్రెస్‌ జెండానే ఉంటుందని చెప్పిన సంగతి విదితమే.  

►కేసీఆర్‌ను ఓడించే గట్టి పార్టీలో ఉంటా. బీజేపీలో చేరే విషయంపై గతంలోనే చెప్పా. పార్లమెంట్‌ ఆవరణలో అమిత్‌ షాతో భేటీ జరిగింది. పార్టీలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పా. 
– రాజగోపాల్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement