బీజేపీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జిషీట్
తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాలంటూ ప్రస్తావన
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ తదితరాలకు చోటు
ప్రజలకు 7 ప్రశ్నలు సంధించిన హస్తం పార్టీ
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాల పేరిట కాంగ్రెస్ ఆ పార్టీపై చార్జిషీట్ వేసింది. ‘నయవంచన’పేరుతో విడుదల చేసిన అభి యోగ పత్రంలో.. తెలంగాణకు చేసిన ద్రోహం, నిధుల విడుదలలో వివక్ష, రైతులు, పేదలు, యువతకు దోఖా, ప్రాజెక్టుల కేటాయింపు, విద్యాసంస్థల ఏర్పాటులో మోసం పొందుపరిచింది.
దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, రైతు వ్యతిరేక బీజేపీ, సామాన్యుడిపై ధరల మోత, పబ్లిసిటీ సర్కార్, దేశ సార్వ¿ౌమత్వానికి భంగం, నిరంకుశత్వ మోదీ, పెరిగిపోయిన నిరుద్యోగం, ఎలక్టోరల్ బాండ్ల స్కామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోదీ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం తదితర అంశాలను మోదీ నిర్వాకాల పేరుతో ప్రస్తావించింది.
మోదీ జుమ్లాలు: మోదీ జుమ్లాలంటూ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు, 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, 2022 కల్లా అందరికీ ఇళ్లు, 100 రోజుల్లో నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ, నిత్యావసరాల ధరల తగ్గింపు, అవినీతిని రూపుమాపడం, నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన, చైనా ఆక్రమణ వంటి అంశాల్లో బీజేపీ మాట తప్పిందని, మోసం చేసిందని పేర్కొంది. కాకినాడలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం నుంచి డాలర్‌తో రూపాయి విలువను రూ.40కి తీసుకెళ్తానని చెప్పి రూ.85కు దిగజార్చడం.. వరకు మొత్తం 50 అంశాలను ఈ 15 నిర్వాకాల్లో ప్రస్తావించింది.
ప్రజలకు ప్రశ్నలు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వినియోగించనున్న ఈ చార్జిషీట్‌లో ప్రాసతో కూడిన 7 ప్రశ్నలను తెలంగాణ ప్రజలకు చార్జి షీట్ ద్వారా కాంగ్రెస్ వేసింది. యువతా.. ఈ మోసాలను సహిద్దామా?, రైతులారా.. ఈ వంచకులను క్షమిద్దామా?, దళిత, గిరిజనులారా ఈ దగాకోరులను నమ్ముదామా?, బీసీల్లారా ఈ అహంకారులను ఆదరిద్దామా?, ఈ భారం ఇంకా భరిద్దామా?, మహిళలారా.. ఈ అసమర్థులకు మద్దతిద్దామా?, ఈ కార్పొరేట్ శక్తులకు తలొగ్గుదామా? అంటూ ప్రశ్నలు సంధించింది. ‘పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..’అనే నినాదంతో బీజేపీపై చార్జిషీట్‌ను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment