
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మేర బ్యాంకు మోసాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఇలాంటి మోసాలు జరగలేదని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రులకే అచ్చెదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు.
వారికోసం ‘దోచుకో, పారిపో’ స్కీమ్
బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్ల మేర మోసగించిన ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఐదేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం ప్రశ్నించారు. బ్యాంకు మోసగాళ్ల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘దోచుకో, పారిపో’ అనే పథకాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, చేతన్, నితిన్ సందేశర తదితరులు ఇండియాలో బ్యాంకులను దోచుకొని, విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. ఈ జాబితాలో తాజాగా ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ మాజీ చైర్మన్, ఎండీ రిషి కమలేష్ అగర్వాల్‌తోపాటు ఇతరులు కూడా చేరుతున్నారని చెప్పారు. వారంతా ‘కొత్త రత్నాలు’ అన్నారు.
రాహుల్ కోసం నా జీవితాన్ని ఇస్తా..
తనకు, తన సోదరుడు రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ఖండించారు. ‘‘నా జీవితాన్ని అన్న కోసం ఇస్తా.. ఆయన జీవితాన్ని నా కోసం ఇస్తారు’’ అని వ్యాఖ్యానించారు. తమ మధ్య విభేదాలు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు. విభేదాలు అనేవి యోగి ఆదిత్యనాథ్ మనసులో ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment