Government rule
-
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మేర బ్యాంకు మోసాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఇలాంటి మోసాలు జరగలేదని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రులకే అచ్చెదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారికోసం ‘దోచుకో, పారిపో’ స్కీమ్ బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్ల మేర మోసగించిన ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఐదేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం ప్రశ్నించారు. బ్యాంకు మోసగాళ్ల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘దోచుకో, పారిపో’ అనే పథకాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, చేతన్, నితిన్ సందేశర తదితరులు ఇండియాలో బ్యాంకులను దోచుకొని, విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. ఈ జాబితాలో తాజాగా ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ మాజీ చైర్మన్, ఎండీ రిషి కమలేష్ అగర్వాల్‌తోపాటు ఇతరులు కూడా చేరుతున్నారని చెప్పారు. వారంతా ‘కొత్త రత్నాలు’ అన్నారు. రాహుల్ కోసం నా జీవితాన్ని ఇస్తా.. తనకు, తన సోదరుడు రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ఖండించారు. ‘‘నా జీవితాన్ని అన్న కోసం ఇస్తా.. ఆయన జీవితాన్ని నా కోసం ఇస్తారు’’ అని వ్యాఖ్యానించారు. తమ మధ్య విభేదాలు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు. విభేదాలు అనేవి యోగి ఆదిత్యనాథ్ మనసులో ఉన్నాయని చెప్పారు. -
మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన
కంకావ్లి: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ పాలన తీరు ఆటో రిక్షాకున్న మూడు చక్రాల మాదిరిగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆటో చక్రాల మాదిరిగా సంకీర్ణలోని పార్టీల ధోరణి ఎవరికి వారే అన్నట్టుగా పొంతనలేకుండా ఉందని ఎద్దేవా చేశారు. ‘శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన ఎంవీఏ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏర్పడిన అపవిత్ర కూటమి. అధికారం కోసమే ఏర్పడిన సంకీర్ణం’అని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాగస్వామిగా ఉన్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. ‘మేం ఏది చేసినా బహిరంగంగానే చేస్తాం. రహస్య రాజకీయాలు ఉండవు. హామీలను మేం గౌరవిస్తాం’అని అమిత్ షా చెప్పారు. మోదీ పేరుతో ఎన్నికల ప్రచారం చేసి, ఓట్లు సంపాదించిన శివసేన చీఫ్ థాకరే ఆ తర్వాత మాటమార్చారని ఆరోపించారు. బిహార్‌లో తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఎన్నికల వాగ్దానాన్ని గౌరవిస్తూ నితీశ్‌కుమార్‌కే సీఎం పదవిని వదిలేశామన్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని కంకావ్లిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 70% తీర్చేది మనమే ప్రపంచ కరోనా వైరస్ వ్యాక్సిన్ అవసరాల్లో మనమే 70% వరకు తీరుస్తున్నామనీ, ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న రెండు రకాల టీకాలను 14 దేశాలకు ఎగుమతి చేసినట్లు మంత్రి అమిత్ షా తెలిపారు. 21 రోజులుగా దేశంలోని 55 లక్షల మందికి టీకా అందించామన్నారు. కోవిడ్–19 కట్టడి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సిబ్బంది, 130 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా పనిచేసి మన దేశంలో మహమ్మారిని నిలువరించగలిగామని స్పష్టం చేశారు. కోవిడ్ మరణాల రేటు, రికవరీ రేటులో కూడా మనమే అత్యుత్తమంగా ఉన్నామని చెప్పారు. -
ఆంధ్రజ్యోతి ప్రభుత్వమట!
కడప కల్చరల్: ‘పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టండి..’అనే సామెత ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఓ తెలుగు పత్రిక వార్తా ఏజెన్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఫలానా పత్రిక ఏజెన్సీ ద్వారా’ అంటూ పత్రికలకు అందే సమాచారంలో తెలియజేస్తారు. అయితే ఆ పత్రికపై ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఇష్టం తారాస్థాయికి పెరిగిందేమో.. ఏకంగా సర్కారు పేరే మార్చేశారు. మంగళవారం జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్ర జ్యోతి ప్రభుత్వం’అని ఉండటం గమనార్హం. దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై జిల్లా సమాచార శాఖ ఏడీని అడిగితే ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని, యథాతథంగా పత్రికలకు పంపామని చెప్పుకొచ్చారు. -
ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకొద్దాం
అమరుల స్ఫూర్తియాత్రలో ప్రొఫెసర్ కోదండరాం రుద్రంగి (వేములవాడ): ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పనిచేయడంలేదని, ప్రజలందరం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకు వద్దామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రెండోరోజు తెలంగాణ అమరుల స్ఫూర్తియాత్ర కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. జీఎస్టీ ద్వారా బీడీ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని, తద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీని మినహాయించాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాము మద్దతు ఇవ్వబోమని రాష్ట్రప్రభుత్వం చెబితే.. కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించదా? అని ప్రశ్నించారు. కానీ, మన పాలకులకు ఇట్లాంటి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందేందుకు, రైతులు గిట్టుబాటు ధరల కోసం, యువత, నిరుద్యోగులు, విద్య, ఉద్యోగాల్లో అవకాశాల కోసం మళ్లీ ఉద్యమించాలని కోదండరాం పిలుపునిచ్చారు.