ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకొద్దాం
అమరుల స్ఫూర్తియాత్రలో ప్రొఫెసర్ కోదండరాం
రుద్రంగి (వేములవాడ): ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పనిచేయడంలేదని, ప్రజలందరం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకు వద్దామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రెండోరోజు తెలంగాణ అమరుల స్ఫూర్తియాత్ర కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. జీఎస్టీ ద్వారా బీడీ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని, తద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు.
బీడీ పరిశ్రమపై జీఎస్టీని మినహాయించాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాము మద్దతు ఇవ్వబోమని రాష్ట్రప్రభుత్వం చెబితే.. కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించదా? అని ప్రశ్నించారు. కానీ, మన పాలకులకు ఇట్లాంటి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందేందుకు, రైతులు గిట్టుబాటు ధరల కోసం, యువత, నిరుద్యోగులు, విద్య, ఉద్యోగాల్లో అవకాశాల కోసం మళ్లీ ఉద్యమించాలని కోదండరాం పిలుపునిచ్చారు.