జనగామ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకు కేంద్ర సర్కారు అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో.. బీజేపీ దాడులతో సానుభూతి పెరిగేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో విజ యం సాధించి.. తెలంగాణలో రెండో శక్తిగా ఎదగాలనే బీజేపీ ఆశలపై అక్కడి ఓటర్లు నీళ్లు చల్లారని అన్నా రు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న బీజేపీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని తమ్మినేని డిమ ండ్ చేశారు. ఈడీ, ఐటీ దాడులను వెంటనే ఆపకుంటే జనం తిరగబడడం ఖాయమన్నారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడం
టీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడేది లేదని, ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలతో పాటు బీజేపీ ద్వంద్వ విధానాలపై పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించాలని, అటవీ శాఖ అధికారిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment