ఎన్నికలకు మరో రెండున్నర నెలల సమయం ఉందనగా టీడీపీలో రోజురోజుకూ వణుకు పెరుగుతోంది. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అత్యంత బలంగా ఉన్న వైయస్సార్‌సీపీకి గెలుపు ఖాయమన్న సర్వేలు స్పష్టంచేస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రశాంత్‌కిశోర్ సహాయం కోసం వేడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో బిహారీ వ్యక్తి దుర్మార్గాలు అంటూ ఆడిపోసుకున్న చంద్రబాబే తిరిగి ప్రశాంత్‌కిశోర్‌ను వేడుకోవడం గమనార్హం. ప్రస్తుతం బిహార్‌లో పాదయాత్రతో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్‌కిశోర్ దాన్ని వదులకుని టీడీపీకోసం పనిచేస్తారా? అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. అలాగే ప్రశాంత్ కిశోరే సృష్టించిన ఐపాక్ ఇప్పుడు వైయస్సార్‌సీపీకి పనిచేస్తుండగా, అదే ఐప్యాక్‌కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ ఇక్కడ పనిచేస్తార? అన్నది మరో ప్రశ్న.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. టీడీపీలో ఉన్న నిరాశజనక వాతావరణం అలానే ఉంది. లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు అరెస్టు, పవన్‌కళ్యాణ్‌తో పొత్తు ఇన్ని జరిగినా టీడీపీ గెలుపు కనుచూపు మేరలో కనిపించడంలేదని సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. చంద్రబాబు కుటుంబానికి, టీడీపీకి జీవన్మరణ సమస్యలా తయారైన ఈ పరిస్థితులనుంచి గట్టెక్కడానికి యజ్ఞయాగాదులు ఓవైపు చేస్తూనే, ఎన్నికల్లో ఎలా గెలవాలన్నదానిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఆశ్రయించారు. ఎలాగైనా సహాయం చేయాలని, గతంలో బిహారీ దోపిడీదారు అంటూ తాను చేసిన కామెంట్లను పట్టించుకోవద్దని కోరారు. కనీసం మాట్లాడేందుకు అయినా ఒక పర్యాయం రావాలిన వేడుకున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ శనివారం (డిసెంబర్ 23న) లోకేశ్‌తో కలిసి విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చారు. ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరిపారు.
బిహార్‌లో మరో రాజకీయ పార్టీకోసం సన్నద్ధమవుతున్న ప్రశాంత్ కిశోర్ బాత్ బిహార్ కి పేరిట 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ విజ్ఞప్తిమేరకు ఇప్పుడు ఈ పాదయాత్రను విరమించి ఇక్కడకు వస్తారా అంటే.. కాదనే సమాధానం ప్రశాంత్ కిశోర్ సన్నిహితుల నుంచి వస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిశోర్ సృష్టించిన ఐప్యాక్ తర్వాత దశలో స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ వైయస్సార్‌సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది. ఇప్పుడు 2024 ఎన్నికలకోసం కూడా పనిచేస్తోంది. ఐప్యాక్‌కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారా? అన్నది ఇక్కడో ప్రశ్న తలెత్తుతోంది. ఏదిఏమైనా ఈ వ్యవహారం టీడీపీ కోసం ఇప్పటికే పనిచేస్తున్న రాబిన్ శర్మకు సంకటంలా మారింది. తాను ఉంటుండగానే కాంగ్రెస్‌కు కోసం పనిచేసిన సునీల్ కొనుగోలుకోసం లోకేష్ ప్రయత్నించడం, చివరకు రాబిన్- సునీల్ మధ్య పొసగక సునీల్ వెళ్లిపోవడం టీడీపీలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు ఇటు రాబిన్‌ను కూడా అలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్లాయన్నది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే వైయస్.జగన్ మాత్రం తనకంటూ సరికొత్త వ్యూహంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. కేవలం వ్యూహకర్తలపైనే ఆయన ఆధారపడలేదు. వ్యూహకర్తలతోపాటు సమాంతరంగా పార్టీలో ప్రత్యామ్నాయ సైన్యం, అలాగే వాలంటీర్లు రూపంలో మరో సైన్యం, గృహసారథులు రూపేణా పార్టీ శ్రేణులతో మరో సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న 84శాతం కుటుంబాలు సీఎం జగన్‌కు మరో బలం.
Comments
Please login to add a commentAdd a comment