సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుంటే అడ్డుకోవడమే చంద్రబాబు పని అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ముందు రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ స్టాండ్ ఏమిటో చంద్రబాబు నోరువిప్పి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన వైఖరిని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాలపై మన రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను సాధించి, రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులపై, కృష్ణాజలాలపై బ్రిజేష్‌కుమార్, బచావత్ తీర్పులకు అనుగుణంగా, న్యాయపరంగా వచ్చే ప్రతి చుక్క నీటిని సాధించి తీరతామని స్పష్టం చేశారు. న్యాయపరంగా మన వాటా ప్రకారం ఎంత నీరు రావాలో అంత తీసుకుంటామని, ఇందులో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
కడుపుమంటతో దుష్ప్రచారం
ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి ప్రయోజనం అందుతోందని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితులోనూ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రూ.లక్ష కోట్లకు పైగా డీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసిన ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో స్థిరమైన నాయకత్వం బలపడుతుందనే దుగ్ధ, చరిత్రలో ఎప్పుడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయనే కడుపుమంటతో చంద్రబాబు, టీడీపీ నేతలు, వారికి వత్తాసు పలికే మీడియా నిత్యం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని, పక్కా ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా జరుగుతోందని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విద్య, వైద్యం, రైతులు, హౌసింగ్‌తో పాటు, మహిళలు, దళితులకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అధి కారం చేపట్టిన రెండేళ్లలోనే నాడు–నేడు ద్వారా విద్య, వైద్యరంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సాధన దీక్ష’ పేరుతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఆయన దీక్ష చేసింది 3 గంటలు, తిట్ల దండకం 4 గంటలు అని మాణిక్యవరప్రసాద్ ఎద్దేవా చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులపై నీ వైఖరేంటి బాబూ?
Published Fri, Jul 2 2021 4:34 AM | Last Updated on Fri, Jul 2 2021 4:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment