సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఎడమొహం, పెడమొహం పెట్టుకున్న నేతలిద్దరూ లంచ్ మీట్.. ఆపై ఆత్మీయ ఆలింగనంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్వీట్ల యుద్ధంతో కాకరేపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. చివరకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లంచ్ మీట్‌లో కలవడం, ఆపై ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చర్చనీయాశంగా మారింది.
మొయినాబాద్‌లోని జితేందర్ రెడ్డి ఫాంహౌజ్ ఏర్పాటు చేసిన లంచ్ మీట్‌లో మాజీ ఎంపీ జితేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భేటీ అయ్యారు. అనూహ్యంగా ఈ ఇద్దరూ నేతలు భేటీ అవ్వడం వెనుక ఆంతర్యమేంటనే దానిపై కార్యకర్తలు విస్తృతంగా చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈటల రాజేందర్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరస్సర కౌంటర్లు చేసుకున్న వీళ్లు.. ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈటలతో భేటీ అనంతరం.. ‘‘రాష్ట్ర బీజేపీపై తప్పుడు ప్రచారం సరికాదు. పార్టీలో అంతా కలిసి పని చేస్తాం. నా ట్వీట్‌ను ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం’’ అంటూ మీడియా ద్వారా జితేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే..
ఇంతకు ముందు ‘తెలంగాణ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్లకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం’ అంటూ దున్నపోతును ట్రాలీ ఎక్కించే వీడియో ఒకటి పోస్ట్ చేసి పెనుదుమారమే రేపాయాన. ఆపై ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేసి.. చివరకు బీఆర్‌ఎస్ నేతలకు కౌంటర్ అనే మీనింగ్ వచ్చేలాగా దానిని పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపైనా ఈటల కూడా కాస్త కటువుగానే స్పందించారు.
సీనియర్లు, అన్నీ తెలిసిన వారు ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వయసు పెరిగిన కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పుడు లంచ్ మీట్ లో ఈ ఇద్దరు నేతల మధ్య నవ్వులు.. ఆత్మీయ అలింగనాలతో భేటీ సాగింది.
ఇదిలా ఉంటే.. ఈటల, ఏపీ జితేందర్ రెడ్డికి మధ్య ముందు నుంచే స్నేహముంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు జితేందర్ రెడ్డి ఇంచార్జీ గా సైతం వ్యవహరించారు. అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాగా గత నెల జితేందర్ రెడ్డి ఇంట్లో అసంతృప్తి నేతలు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇప్పుడు లంచ్ మీట్ తో పాత మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారు.
ఇదీ చదవండి: ఏయ్.. నన్నే ఆపుతారా?.. కేఏపాల్ హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment