సాక్షి, న్యూఢిల్లీ : ఒకనొక సమయంలో దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ సీనియర్ నేతలే కాంగ్రెస్ అధిష్టానంపై బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి పంపారు.
ఆ లేఖలో ఆయన తాజా పరిణామాలు, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీతో తనకున్న 46 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
అనంతరం అశ్వని కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా బాధకరమైన విషయమని అన్నారు. ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆత్మగౌరవానికి అనుగుణంగానే పార్టీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనను తాను కొత్తగా ఆవిష‍్కరించుకోలేకపోయిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం క్షీణిస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.
కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సవాళ్లను ఎదుర‍్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే, తాను పార్టీని మాత్రమే వీడానాని క్రియాశీల రాజకీయాలను కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటానని తెలిపారు.
కాగా, అశ్వని కుమార్ యూపీఏ హయంలో అక్టోబర్ 2012 నుండి మే 2013 వరకు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment