సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు గాంధీ కుటుంబ నాయకత్వాన్ని సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. దేశ రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఈ సమయంలో ఇలాంటి అంశాన్ని లేవనెత్తడం తగదని అమరీందర్ సింగ్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశ స్వాతంత్ర్యం సాధించడం నుంచి గాంధీ కుటుంబం దేశ పురోగతికి తీవ్రంగా శ్రమించిందని గుర్తుచేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు గాంధీ కుటుంబ నేతలే సరైన వారని అన్నారు.
దేశంలో బలమైన విపక్షం లేనందునే ఎన్డీయే అప్రతిహత విజయం సాధిస్తోందని, ఈ సమయంలో పార్టీ ప్రక్షాళనకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ, దేశ ప్రయోజనాలకు విఘాతమని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం సరిహద్దుల వెలుపల కాకుండా అంతర్గతంగానూ పలు సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్ధకు ముప్పు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకతాటిపై నిలిచిన కాంగ్రెస్ ఒక్కటే దేశాన్ని,ప్రజలను కాపాడగలదని చెప్పారు. మరోవైపు సోనియా గాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ సైతం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ఎలాంటి సవాల్ ఎదురైనా సోనియా, రాహుల్ చొరవ చూపి పరిష్కరించేవారని, మేమంతా మీతో ఉన్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు.
ఇక పార్టీలో నాయకత్వ మార్పు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం కలకలం రేపింది. పార్టీలో నాయకత్వ మార్పును కోరుతూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి రాహుల్‌కు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేత వైపు మొగ్గుచూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment