ఫ్రస్ట్రేషన్‌లో చంద్రబాబు | Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఫ్రస్ట్రేషన్‌లో చంద్రబాబు

Published Fri, Jul 8 2022 4:44 AM | Last Updated on Fri, Jul 8 2022 4:44 AM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ విలువలను అథఃపాతాళానికి నెట్టేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎల్లో మీడియాతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ప్రభుత్వంపై బురదజల్లినా ఆయన గ్రాఫ్‌ అణువంత కూడా పెరగడంలేదన్న ఫ్రస్ట్రేషన్‌లో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. శ్రీకాంత్‌ రెడ్డి గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ వ్యక్తిగత, కుల రాజకీయాలు, అవినీతిని పెంచి పోషించారని, వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు.

అందువల్లే 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన నిర్మించిన వ్యవస్థలతో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు కనీసం భరోసా ఇవ్వకుండా, హైదరాబాద్‌లో రూ. 300 కోట్లతో నిర్మించుకున్న కోటలో నెలల తరబడి దాక్కున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు మహానాడులంటూ తిరుగుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు ఫలానా మంచి చేశాను అని ఎక్కడా చెప్పలేరని, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పడం చేతకాదని ఎద్దేవా చేశారు.

సొంత జిల్లా చిత్తూరుకు ఏమీ చేయలేని చంద్రబాబు.. సీఎం జగన్‌పైనా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి  తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. బాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ మూడేళ్ల పాలనలో విద్యా, వైద్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై తామెంత ఖర్చు పెట్టామో లెక్కలు తీసుకు వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇదే చాలెంజ్‌ అని అన్నారు.

సీఎం జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రగల్భాలు
తన కొడుకు వయసున్న సీఎం జగన్‌ని రాజకీయంగా ఎదుర్కొలేక, సానుభూతి కోసం 20 నిమిషాలు  బోరున ఏడ్చిన చంద్రబాబు, ఇప్పుడు తాను కన్నెర్ర చేస్తే వైఎస్సార్‌సీపీ వాళ్లు బయటకు రాలేరని అనడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్‌ పిల్లలు విదేశాల్లో చదివితే, పేద పిల్లలను సరిగా చూసుకోవడంలేదని అంటున్నారని మండిపడ్డారు. మరి నీ కొడుకు, నీ మనవడు ఎక్కడ చదివారు? నారావారిపల్లెలో చదివించారా? ప్రభుత్వ స్కూల్‌లో చదివించారా అని ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలు చేయడానికి బాబుకు అర్హత ఉందా అని నిలదీశారు.

నాడు – నేడు తో సీఎం జగన్‌ పాఠశాలల్లో విద్యా బోధన, మౌలిక సదుపాయాల్లో సమూల మార్పులు చేస్తున్నారని తెలిపారు. బాబు హయాంలో స్కూళ్లు, ఇప్పుడు స్కూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే అర్థం అవుతుందన్నారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ను అమలు చేసి, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాంటి వైఎస్సార్‌ తనయుడు సీఎం జగన్‌ రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే 30 ఏళ్ల వరకు రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడానికి మంచి ప్రణాళిక అమలు చేస్తే దానిపైనా ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలంటే ఎన్నికలే కాదని, ప్రజా సేవ కూడా అని చంద్రబాబు గుర్తెరగాలన్నారు. నీచ రాజకీయాలు చేసే బాబును తెలుగు ప్రజలెప్పుడూ అధికారంలోకి రానివ్వరని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement