మైఖేల్ లోబో
పణజి: మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ లేకుండా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న గోవా బీజేపీ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. నిన్న ఒక్కరోజే ఇద్దరు కీలక నేతలు మంత్రి మైఖేల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే పార్టీని వీడారు. కలంగుటే నియోజక వర్గం నుంచి లోబో.. మయం నియోజక వర్గం నుంచి ప్రవీణ్ జాంతే ఎమ్మెల్యేగా ఉన్నారు. నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న లోబో బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సామాన్యుల పార్టీ కాదని, అందుకే బయటకు వెళ్లిపోయినట్టు ఆయన ప్రకటించారు.
మాజీ సీఎం పరీకర్ ఆలోచన విధానంతో పార్టీ నడవడం లేదని, ఆయన వర్గీయులను ప్రస్తుత నాయకత్వం గౌరవించడం లేదని మండిపడ్డారు. లోబో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. క్యాథిలిక్ లీడర్ అయిన లోబో వెళ్లిపోవడంతో.. ఉత్తర గోవాలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, సమస్యకు బీజేపీ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని ప్రవీణ్ జాంతే ఆరోపించారు. గత నెలలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడిపోయారు. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వ మెజార్టీ 23కు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment