సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29న నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం తిరుపతిలోని పీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని వారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేసి గురుమూర్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా అఖండ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 21 నెలల సంక్షేమ పాలన గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. కులం, మతం, పారీ్టలతో ప్రమేయం లేకుండా అర్హులందరికీ పథకాలను అందించిన ఘనతను చాటాలన్నారు. ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలసి వారి ఆశీస్సులు కోరాలన్నారు. బీసీ, ఎస్సీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని, వారిని సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ క్రమంలోనే డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారని ఆయన వివరించారు.
వలంటీర్ వ్యవస్థకు ప్రపంచస్థాయి కీర్తి
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థకు ప్రపంచస్థాయి కీర్తి దక్కిందన్నారు. సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీకి వస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు చేసిన నకిలీ ఓటరు కార్డుల ఆరోపణలను కొట్టిపడేశారు. అలాంటి కర్మ తమకు పట్టలేదని, ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పాలనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు మట్టికరిచాయని ఆయన అన్నారు. ప్రజాదీవెనలతో డాక్టర్ గురుమూర్తి 4 లక్షలకుపైగా మెజారిటీ సాధిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆదిమూలం, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment