సీఎం రేవంత్‌ తెలంగాణ ద్రోహి | Harish Rao Made Serious Comments On Telangana CM Revanth Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ తెలంగాణ ద్రోహి

Published Mon, Dec 16 2024 6:19 AM | Last Updated on Mon, Dec 16 2024 11:30 AM

Harish Rao Comments on Revanth Reddy

ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదు 

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ లేకుండా ఏ ఉద్యమాలూ లేవు: హరీశ్‌రావు

సిద్దిపేట జోన్‌: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్‌ సాహిత్య పుస్తకావిష్కరణ సభలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అవార్డుల పేరుతో తన మరకలను కడిగేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసి, విగ్రహ రూపాన్ని మార్చడం నచ్చకనే కవి నందిని సిధారెడ్డి ప్రభుత్వ ఇవ్వజూపిన నజరానా, ఇంటి స్థలాన్ని తిరస్కరించారని తెలిపారు. రూ.కోటి రూపాయలు ముఖ్యం కాదని, మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని చాటిన నందిని సిధారెడ్డి ఎంతో గొప్పవారని అభినందించారు.  

మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమానికి గద్దర్‌ ప్రజాగొంతుకగా నిలిచారని హరీశ్‌రావు అన్నారు. ఆయన లేనిది ఏ ఉద్యమం లేదు.. మలిదశలోనూ గద్దర్‌ కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు. గద్దర్‌ పోరాటం భావితరాలకు తెలిసేలా పుస్తకాలు ముద్రించటం మంచి ఆలోచన అని ప్రశంసించారు. తండ్రి పోరాటాన్ని, గొప్పతనాన్ని రేపటి తరాలకు అందించి నిజమైన వారసుడు అనిపించుకున్నారని గద్దర్‌ కుమారుడు సూర్యకిరణ్‌ను అభినందించారు. గద్దర్‌ పాట ఉన్నంత కాలం ప్రజల మధ్య ఆయన సజీవంగా ఉంటారన్నారు. సిద్దిపేటలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచన అభినందనీయమని, గద్దర్‌ జీవిత చరిత్రతో కూడిన డాక్యుమెంటరీ తయారీ చేయాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ లేకుండా ఏ ఉద్యమాలూ లేవు: హరీశ్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement