ఆ పనిలోనే సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
రుణమాఫీపై మహారాష్ట్రలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే
రైతుబంధు, వరికి బోనస్, ఉద్యోగాల కల్పన వంటివన్నీ బోగస్
రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డబ్బును మహారాష్ట్రకు పంపే పనిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని.. కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికల కోసం డబ్బులు రేవంతే సమకూర్చుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలో రుణమాఫీ చేశామని, రైతు బంధు, వరికి బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, గాలిమోటార్లలో రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘సీఎం రేవంత్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారు. తెలంగాణలో మోసం చేసినట్టు అక్కడి ప్రజలనూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌దే. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అవాస్తవాలు చెప్పారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 42 లక్షల మందికి రూ.31 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపారు. ఇంకా 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. తెలంగాణలో పోలీసు కానిస్టేబుళ్లు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు.
గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు గెలిచాక గ్యారేజీకి పోయాయి. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. ఏ హామీలు అమలు చేశారో, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. బహిరంగ చర్చకు నేను సిద్ధం.
మహిళలకు అభయ హస్తం ఏదీ?
మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని అభయ హస్తంలో చెప్పిన మొదటి హామీకే దిక్కులేదు. మహారాష్ట్రలో మాత్రం కోతలు కోస్తున్నారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.27,500 బాకీ ఉంది. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, రైతుకూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారింది. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. ఇప్పుడా గాం«దీలు ఎక్కడికి పోయారో తెలియదు.
రైతుల ధాన్యం కొనేదెవరు?
రాష్ట్రంలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాల్ వడ్లు రూ.1,900కే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు రోడ్లపై వరికుప్పలే సాక్ష్యం. పైగా బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో బోగస్ మాటలు మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పారు. ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలేదు. పైగా కేసీఆర్ ఇచ్చనా ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment