
సాక్షి, అమరావతి : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తన మరిది కుటుంబాన్ని ఆదుకోడానికి రంగంలోకి దిగిన పురంధేశ్వరి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ బిజెపి ప్రయోజనాలు కూడా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడి తరపున ఆమె వకాల్తా పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ పద్ధతిగా లేదంటూ అక్కసు వెళ్లగక్కారు. ఎఫ్.ఐ.ఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ లే మ్యాన్ తరహాలో అమాయకంగా ప్రశ్నించారు పురంధేశ్వరి.కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పురంధేశ్వరికి ఎఫ్.ఐ.ఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయవచ్చునని తెలీదా అని న్యాయరంగ నిపుణులు నిలదీస్తున్నారు.
తమలో తాము ఎంతగా కొట్టుకున్నా..గొడవలు పడ్డా..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా ఓ ఆపద వస్తే తామంతా ఒక్కటిలాగే ఉండాలని పురంధేశ్వరి అనుకున్నట్లున్నారు. రూ.371 కోట్ల లూటీ కేసులో చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన వెంటనే అమాంతం దాన్ని ఖండించేశారు పురంధేశ్వరి. అలా ఎలా అరెస్ట్ చేస్తారు ఇది పద్ధతిగా లేదన్నారు. ఏ ఆధారాలు లేకుండా ..ఎఫ్.ఐ.ఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడి లూటీకి సంబంధించిన కేసును వెలుగులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని జి.ఎస్.టి. అధికారులు. చంద్రబాబు నాయుడికి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జన తరలి వచ్చిందని నోటీసులు జారీ చేసింది కేంద్రం పరిధిలోని ఐటీ అధికారులు. స్కిల్ స్కాంలో అక్రమాలను వెలుగులోకి తీసి షెల్ కంపెనీలకు చెందిన వారిని అరెస్ట్ చేసింది కేంద్రం పరిధిలోని ఈడీ అధికారులు. ఈడీ నివేదిక ఆధారంగానే.. ఏపీ సిఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు అయి ఉండి కూడా పురంధేశ్వరి ఇవేవీ తనకు తెలీదన్నట్లు చంద్రబాబు నాయుణ్ని ఎలా కాపాడుకోవాలా అని తాపత్రయ పడ్డారు.
తన చెల్లెలి కొడుకు అయిన నారా లోకేష్ ను తీసుకుని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారు. లోకేష్ పదే పదే అపాయింట్ మెంట్ అడగడంతో ఆయన బాధేంటో తెలుసుకోడానికి అమిత్ షా పోనీలే అని అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆ భేటీలో లోకేష్ కు ఎలాంటి భరోసా రాకపోగా.. ఇటువంటి పైరవీలు తన దగ్గరకు తీసుకురావద్దని అమిత్ షా పురంధేశ్వరిని సున్నితంగానే మందలించినట్లు బిజెపి వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.ఈ ఎపిసోడ్ ను మీడియా ఫోకస్ చేయడంతో పురంధేశ్వరి బాగా ఇబ్బంది పడ్డారు. అప్పట్నుంచీ చంద్రబాబు కనుసన్నల్లో ఏపీ ప్రభుత్వంపై బురదజల్లడాన్ని అజెండాగా పెట్టుకున్నారు పురంధేశ్వరి. ఏపీలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగిపోతున్నాయని వేల కోట్లు దోచేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు పదే పదే చేస్తూ వచ్చిన ఆరోపణలనే పురంధేశ్వరి అందుకున్నారు. బూమ్ బూమ్ వంటి కొత్త బ్రాండ్లను ఎందుకు తెచ్చారంటూ ప్రశ్నించారు. చిత్రం ఏంటేంటే ఆ కొత్త బ్రాండ్లన్నీ పురంధేశ్వరి మరిది చంద్రబాబు నాయుడు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలకు నెల రోజుల ముందు అర్జంట్ గా జీవో ఇచ్చి తెచ్చిన బ్రాండ్లే.
చంద్రబాబు నాయుడి హయాంలో తమ వాళ్ల డిస్టిలరీలు, బ్రూవరీలకు లబ్ధి చేకూర్చేందుకు దొడ్డిదోవన ఓ జీవో తెచ్చి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. దానిపై ఇపుడు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.దానికి ఏసీబీ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది.చంద్రబాబు నాయుడి హయాంలో ఈ మద్యం అక్రమాలపై పురంధేశ్వరి ఏనాడూ నోరు మెదపలేదు. ఇపుడు అంతా పారదర్శకంగానే ఉన్నా ఏదో జరిగిపోతోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు.ఇసుక విషయంలోనూ అంతే. చంద్రబాబు నాయుడి హయాంలో ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్లు టిడిపి నేతల జేబుల్లోకి వెళ్లాయని పాలకపక్షం ఆరోపిస్తోంది. ఇపుడు ఇసుక అమ్మకాలపై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. ఒక్క పైసా ఆదాయం ఖజానాలో జమచేయని చంద్రబాబు పాలనపై పురంధేశ్వరి పల్లెత్తు మాట అనలేదు. ఇపుడు నిజాయితీగా ఖజానాకు ఆదాయాన్ని పెంచితే ఇదేం దారుణం అంటున్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే పురంధేశ్వరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పురంధేశ్వరి వ్యవహార శైలిని నిశితంగా^గమనిస్తోన్న ఏపీ బిజెపిలో ఆమె వైరి వర్గం పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment