రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసికట్టుగా పోటీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ క్రమంలో అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగానూ 70చోట్ల కాంగ్రెస్, జేఎంఎం పార్టీల అభ్యర్థులను నిలబెడతారని హేమంత్ సోరెన్ వెల్లడించారు.
సీట్ల పంపకాలపై ప్రస్తుతం మరిన్ని వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదని, తమ మా కూటమి భాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరని తెలిపారు. వారు వచ్చినప్పుడు మిత్రపక్షాల నేతల సమక్షంలోనే సీట్ల సంఖ్యను, ఇతర వివరాలను ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. మిగతా 11 స్థానాల్లో ఇతర కూటమి భాగస్వాములు ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
కాగా జార్ఖండ్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గత ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి జేఎంఎం తమ సీట్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్జేడీ అసంతృప్తి
సోరెన్ ప్రకటనపై ఆర్జేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ స్పందించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 15- 18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని వ్యాఖ్యానించింది.
డీజీపీపై వేటు
ఇదిలా ఉండగా ఝార్ఖండ్ తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాపై భారత ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment