సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ శాసనసభా స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించి నవంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపింది. ఇందుకు వీలుగా అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీచేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ సహా 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ జారీచేసింది. ఖంద్వా (మధ్యప్రదేశ్), మండి (హిమాచల్‌ప్రదేశ్) దాద్రానగర్ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనుంది. అలాగే అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బిహార్‌లో 2, రాజస్తాన్‌లో 2, కర్ణాటకలో 2, హరియాణాలో 1, మహారాష్ట్రలో 1, మిజోరంలో నాగాలాండ్‌లో 1.. ఇలా మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాలకు రెండు షెడ్యూళ్లను జారీచేసింది.
కోవిడ్ ఆంక్షల మధ్య...
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ జారీచేసిన మార్గదర్శకాలను మరింత పటిష్ట పరుస్తూ ఈసీ ఉప ఎన్నికల ప్రక్రియలో కఠినమైన నిబంధనలను విధించింది.
సమావేశాలకు ఆంక్షలు ఇలా...
ఇన్ డోర్ మీటింగ్స్..
భవనంలో సిట్టింగ్ సామర్థ్యంలో 30 శాతం మేర, లేదా 200కు మించకుండా.. వీటిలో ఏది తక్కువైతే ఆ నిబంధన వర్తిస్తుంది. సమావేశం నిర్వహిస్తే కచ్చితంగా హాజరైన వారి సంఖ్యను లెక్కించేందుకు రిజిస్టర్ తప్పనిసరి.
ఔట్ డోర్ మీటింగ్స్..
►స్టార్ క్యాంపెయినర్ ఉన్న సందర్భంలో అయితే బహిరంగ స్థలంలో 50 శాతం సామర్థ్యంతో గరిష్టంగా 1,000 మంది వరకు నిర్వహించుకోవచ్చు. ఇందులో ఏది తక్కువైతే ఆ నిబంధన వర్తిస్తుంది. స్టార్ క్యాంపెయినర్ కాకుండా ఇతరులు ఉన్న సందర్భంలో అయితే సామర్థ్యంలో 50 శాతం లేదా గరిష్టంగా 500 మంది.. ఏ సంఖ్య తక్కువైతే ఆ నిబంధన వర్తిస్తుంది. ఈ మొత్తం సభ చుట్టూ పోలీసులు వలయాన్ని ఏర్పాటు చేసి రక్షణగా ఉంటారు. ఆయా సభలకు హాజరయ్యే వారి సంఖ్యను లెక్కించేందుకు పర్యవేక్షణ ఉంటుంది. సభ చుట్టూ వలయాలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును అభ్యర్థులు లేదా పార్టీ భరించాల్సి ఉంటుంది. బ్యారికేడ్లు ఏర్పాటు చేయదగిన బహిరంగ స్థలాలను మాత్రమే సభలకు వినియోగించాలి.
స్టార్ క్యాంపెయినర్స్.. 20
►స్టార్ క్యాంపెయినర్స్ సంఖ్యపై ఈసీ పరిమితి విధించింది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు 10 మంది మాత్రమే స్టార్ క్యాంపెయినర్స్ ఉండాలి.
►రోడ్‌షోలు: రోడ్‌షోలకు అనుమతి లేదు. అలాగే బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు.
►వీధుల్లో సమావేశాలు: స్థల లభ్యతను బట్టి 50 మందికి మాత్రమే అనుమతి.
►ఇంటింటి ప్రచారం: అభ్యర్థులు, వారి ప్రతినిధులు సహా మొత్తం ఐదుగురికే అనుమతి.
►వీడియో వ్యాన్ ద్వారా ప్రచారం: స్థల లభ్యతను బట్టి కేవలం 50 మందికి అనుమతి.
►వాహనాల అనుమతి: ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి (స్టార్ క్యాంపెయినర్‌కు మినహాయించి) గరిష్టంగా 20 వాహనాలు వినియోగించుకునేందుకు మాత్రమే అనుమతి. ఆయా వాహనాల్లో సీట్ల సామర్థ్యంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలి.
►పోలింగ్ ముగిసే సమయానికి ముందు 72 గంటల పాటు ప్రచారంపై నిషేధం.
నామినేషన్లకు ఆంక్షలు
నామినేషన్ వేసే ముందు, తరువాత ర్యాలీలు నిషేధం. బహిరంగ సభలు నిషేధం. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో 3 వాహనాలకు మాత్రమే అనుమతి.
ప్రచార సమయంలో ఆంక్షలు
ప్రచార కాలంలో కోవిడ్ ఆంక్షలను పాటించకపోతే అభ్యర్థులకు తదుపరి అనుమతులు దక్కవని ఈసీ స్పష్టం చేసింది. కోవిడ్ ప్రొటోకాల్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ బాధ్యులవుతారంది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తదుపరి ఇక ఆ నియోజకవర్గంలో, జిల్లాలో ప్రచారానికి అనుమతి ఉండదని హెచ్చరించింది. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న సిబ్బంది, అధికారులను మాత్రమే ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment