సాక్షి, న్యూఢిల్లీ: గతంలో బయటపడ్డ 2 జీ, బొగ్గు కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భారీగా అవినీతి జరిగిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం కోసం రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని...అందులో వేలాది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దోచుకున్నారని షర్మిల మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా వైఎస్సార్‌టీపీ మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పార్లమెంట్ ముట్టడికి బయల్దేరే ప్రయత్నం చేయగా జంతర్‌మంతర్ వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు షర్మిలతో పాటు పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం వైఎస్ షర్మిలతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ఒక గంట తర్వాత విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment