సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. తాడోపేడో తేల్చుకోవడానికి ఇరువర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. అంతు చూస్తాం.. హతమారుస్తాం అనే వరకు వెళ్లిపోయారు. ఆ మధ్య ‘ఇదేం ఖర్మ’ నిర్వహించే విషయంలో విభేదాలొచ్చి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఫ్లెక్సీల విషయంలో పోలీసులను ఆశ్రయించారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లడంతో ఇదేం కర్మ అని అటు నియోజకవర్గ ప్రజలు, ఇటు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. సాధారణంగా పార్టీలో అసమ్మతి చెలరేగితే పార్టీ అధిష్టానం సర్ధి చెప్పాలి. కానీ, శ్రీకాకుళం టీడీపీ నేతల పోరును పోలీసుస్టేషన్‌లో పంచాయితీ చేయాల్సి రావడం గమనార్హం.
ఎన్నాళ్లీ ఊడిగం..
నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దంపతులు, గొండు శంకర్ వర్గీయుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. కాలం చెల్లిన నేతలు ఇంకెంత కాలం నాయకత్వం వహిస్తారని, ఎన్నాళ్లు వారికి ఊడిగం చేయాలని గొండు శంకర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు లక్ష్మీదేవికి ఇవ్వొద్దని, తమకే కేటాయించాలని గొండు శంకర్ వర్గీయులు డిమాండ్ చేయడమే కాకుండా అధిష్టానం దూతలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చుకుంటున్నారు.
తాజాగా ఫ్లెక్సీల గొడవ..
గొండు శంకర్ పుట్టిన రోజు సందర్భంగా గారలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని గుండ లక్ష్మీదేవి వర్గీయులు పట్టపగలే చించేసి తొలగించారు. తోటి కార్యకర్తలు చూస్తుండగానే లక్ష్మీదేవి అనుచరులైన మండల పార్టీ కార్యదర్శి జల్లు రాజీవ్, శ్రీకూర్మం మాజీ ఎంపీటీసీ కైబాడీ రాజులు కలిసి గొండు శంకర్ ఫ్లెక్సీలు చించేయడమే కాకుండా లక్ష్మీదేవికి వ్యతిరేకంగా పనిచేసే వారికి బుద్ధి చెబుతామని, ఏమాత్రం మర్యాద లేకుండా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో గొండు శంకర్ వర్గీయులు ఘాటుగా స్పందించారు. మేమేంటో తేల్చుతామని అంటూనే గార పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గొండు శంకర్ వర్గీయులైన గార మాజీ సర్పంచ్ బడకల వెంకట అప్పారావు, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ రమణమూర్తి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
తమాషా చూస్తున్న అధిష్టానం..
నేతల మధ్య తారస్థాయికి విభేదాలు చేరడంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వీరి మధ్య గొడవతో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అధినేతల డైరెక్షన్‌లో జరుగుతోంది. గొండు శంకర్ వర్గీయులకు అండగా కింజరాపు అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మీదేవికి అండగా కళా వెంకటరావు ద్వారా నారా లోకేష్ అండదండలుండటంతో ఎవరికి వారే బరి తెగించి ‘ఫైటింగ్’ చేసుకోవడానికి సిద్ధమవుతున్నా రు. ఎక్కడైనా పార్టీలో విభేదాలుంటే అధిష్టానం చొరవచూపి పరిష్కరించాలి. ఇక్కడ మాత్రం అధిష్టానం పెద్దలే వెనకుండి తమాషా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి వారికున్న భయాలకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నారు. దీన్నిబట్టి శ్రీకాకుళం టీడీపీ గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏదో ఒక రోజు కేడర్ ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వీరి వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. అసాంఘిక శక్తుల మాదిరి వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది.
గతంలోనూ ఇదే పరిస్థితి..
గార మండలం అంపోలు పంచాయతీలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సన్నద్ధమవ్వగా, ఇక్కడ చేయడానికి వీల్లేదని గొండు శంకర్ వర్గీయులు అడ్డు తగిలారు. లక్ష్మీదేవి అనుచరుడు వెలమల శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా, గొండు శంకర్ అనుచరులైన మూర్తి, అచ్యుతరావులు అడ్డుకునేందుకు యత్నించారు. ఫోన్, వాట్సాప్ ద్వారా ఎవరు అడ్డుకుంటారో చూస్తామని లక్ష్మీదేవి వర్గం, ఎవరొచ్చి నిర్వహిస్తారో చూస్తామని గొండు శంకర్ వర్గీయులు వాదించుకున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన నాయకులు ఇటీవల జరిగిన రామశేషు హత్య మాదిరిగా హతమార్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో అంపోలులో పార్టీ కార్యక్రమానికి బందోబస్తు కావాలని, తమను అడ్డుకోవడానికి గొండు శంకర్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారని లక్ష్మీదేవి వర్గం శ్రీకాకుళం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా గొండు శంకర్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీదేవి తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాస్త సీరియస్‌గానే స్పందించారు. పార్టీ కార్యక్ర మం నిర్వహించుకుంటే ఫర్వాలేదని, గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment