
న్యూఢిల్లీ: కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై ఆస్తుల గురించి వివాదం సృష్టించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పవాన్ ఖేరా మండిపడ్డారు. కేంద్ర సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ ఎప్పుడో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయానని, ఈ సంస్థల ద్వారా ఎన్డీయే సర్కారు ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, సుప్రియా సూలే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎంపీ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్నికల అఫిడవిట్‌లో తన భర్తకు సంబంధించిన ఆస్తులను పేర్కొనలేదన్న అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు, సుప్రియా సూలేను వివరణ ఇవ్వాల్సిందిగా కోరగా, షేర్‌హోల్డింగ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని, అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.